- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS ఖమ్మం సభకు ఆంధ్రా జనం.. ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగింత!!
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో తొలి బహిరంగ సభను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు గట్టి మెసేజ్ ఇచ్చేలా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వ్యూహంలో భాగంగానే రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాను వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ నుంచి వీలైనంత ఎక్కువ మందిని సమీకరించడంపై చర్చలు జరిగాయి. ఇద్దరు మంత్రులు ఈ బాధ్యతలు అప్పగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ నుంచి ప్రజలను ఈ సభకు తరలించడంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఏపీ నుంచి జనాన్ని సమీకరించే బాధ్యత ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలైన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి తదితరులు చూసుకుంటున్నప్పటికీ మంత్రులు తలసాని, శ్రీనివాసగౌడ్ సైతం వారి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ఉన్న సంబంధాలు జన సమీకరణలో కీలకంగా పనిచేస్తున్నాయి. విజయదశమి రోజున టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా ఆవిర్భవించడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకోడానికి వెళ్లిన సమయంలో అక్కడి నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా మంత్రి శ్రీనివాసగౌడ్ అక్కడకు వెళ్లి గౌడ సంఘం నేతలతో చర్చలు జరిపారు. ఆ రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ సైతం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు.
ఐదు లక్షల మంది టార్గెట్..
సుమారు ఐదు లక్షల మంది జనాన్ని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఏపీ నుంచీ భారీ సంఖ్యలోనే జనాన్ని తరలించేందుకు కసరత్తు మొదలైంది. ఏపీ వ్యవహారాలను ఇద్దరు మంత్రులతో పాటు అక్కడి బీఆర్ఎస్ నేతలు, కుల సంఘాల పెద్దలు చూసుకుంటున్నారు. తెలంగాణలో మాత్రం ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం తదితర జిల్లాల నుంచి కూడా ప్రజలు, పార్టీ కార్యకర్తలను తరలించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్‌కు ఉన్న బలమేంటో ఈ సభ ద్వారా తెలియజేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. సభకు ఏపీ నుంచి జనాన్ని తరలించడంతో పాటు అక్కడ పార్టీకి ఉన్న ఆదరణపై ఇప్పటికే ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు రావెల కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు కేసీఆర్‌తో చర్చించారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇటీవల నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా బహిరంగసభపై పడనున్న ప్రభావం గురించి ఆ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున బాధ్యతలను ఆ జిల్లా నేతలకే వదిలిపెట్టకుండా ఇతర మంత్రులను సైతం కేసీఆర్ భాగస్వాములను చేస్తున్నారు. సక్సెస్ చేసే బాధ్యత మంత్రి హరీశ్‌రావుకు అప్పజెప్పడంతో రెండు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. సభా వేదిక ఏర్పాట్లను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చూసుకుంటున్నారు. కేరళ, పంజాబ్, ఢిల్లీ సీఎంలతో పాటు సీపీఐ, సీపీఎం జాతీయ స్థాయి నేతలు కూడా ఇందుకు హాజరుకానున్నారు.
వర్క్ డివిజన్
ప్రజల తరలింపు విషయంలో వైరా నియోజకవర్గాన్ని అంథోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి చూసుకుంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి, పాలేరును ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సూర్యాపేటను మంత్రి జగదీశ్ రెడ్డి, మహబూబాబాద్, ములుగు జిల్లాలను మంత్రి సత్యవతి రాథోడ్ చూసుకుంటున్నారు. వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కొత్తగూడెం జిల్లాను వనమా వెంకటేశ్వర్‌రావు చూసుకుంటున్నారు. పినపాకను స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇల్లెందును స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్, అశ్వరావుపేటను తుమ్మల నాగేశ్వర్ రావు, స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు, మధిరను ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చూసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గం, జిల్లా నుంచి ఎంత సంఖ్యలో జనాన్ని సమీకరించాలో నిర్దిష్ట టార్గెట్ ఫిక్స్ అయింది. ఏపీ నుంచి కూడా వీలైనంత ఎక్కువ మందిని తరలించడం ద్వారా ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు జనాదరణ ఉన్నదనే సంకేతాన్ని ఖమ్మం సభ ద్వారా పంపాలన్నది కేసీఆర్ భావన. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాను ఎంచుకోవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. ఏపీలో పార్టీని విస్తరింపజేయడానికి అక్కడి జనం స్వయంగా ఈ సభను చూడటం ద్వారా జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు. దీనితో పాటు ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరమై వేరు కుంపటి పెట్టుకున్నా జరిగిన నష్టమేమీ లేదనే మెసేజ్‌ను తెలంగాణ రాష్ట్రానికి పంపాలన్నది మరో అంశం.
పొంగులేటిని ఒంటరి చేసే ప్లాన్
వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా టెన్షన్ పట్టుకున్నది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయనతో పాటు జిల్లాల్లో కీలక నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. దీంతో పొంగులేటి వెంట లీడర్లు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రగతిభవన్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్‌లో ఉంటే భవిష్యత్ ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్.. లేదంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగైదు అసెంబ్లీ సెగ్మెంట్లలో పొంగులేటి ప్రభావం ఉంటుంది. ఆ నియోజకవర్గాలకు చెందిన లీడర్లు ఆయన వెంట బీజేపీలో చేరితే బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవనే ఆందోళన గులాబీ పార్టీ నేతల్లో మొదలైంది. అందుకే పొంగులేటి వెంట ఉండే కీలక నేతలతో ప్రగతిభవన్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను చూసుకుంటున్న మంత్రి హరీశ్.. సంప్రదింపులు సైతం జరుపుతున్నట్టు టాక్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల్లో మెజారీటీ నాయకులకు టికెట్ కట్ చేసే చాన్స్ ఉందని ప్రచారం. ఆ నియోజకవర్గాల్లో పొంగులేటి వర్గీయులు బలంగా ఉన్నందున అందులో కొందరికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని ఆశ చూపుతున్నట్టు తెలిసింది. ఇలా పొంగులేటి వెంట వెళ్లేవారిని కట్టడి చేసి ఆయన్ను ఒంటరి చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది.
Read more: