ఢిల్లీ లిక్కర్ స్కాంలో MLC కవితకు బిగుస్తున్న ఉచ్చు?

by GSrikanth |   ( Updated:2022-10-10 08:22:38.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాంలో MLC కవితకు బిగుస్తున్న ఉచ్చు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా పలువురిని విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ వారి వద్ద నుండి కీలక సమాచారం రాబడుతోంది. ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్టులు చేస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా సోమవారం హైదరాబాద్ కు చెందిన అభిషేక్ బోయినపల్లిని సీబీఐ ఆరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ ఇంతకు ముందు విజయ్ నాయర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా ఈడీ సమీర్ మహేంద్రు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసి ఢిల్లీ కార్యాలయంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అభిషేక్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడు, గతంలో ఆమెకు పీఏగా పని చేశాడనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

అభిషేక్ రావు అనూస్ బ్యూటీ పార్లర్ అడ్రస్ తోనే రాబిన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు అభిషేక్ రావు మరో తొమ్మిది కంపెనీల్లో డెరెక్టర్ గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే సీబీఐ ఎఫ్ఐఆర్ లో రామచంద్ర పిళ్లై ను ఏ 14 గా సీబీఐ పేర్కొనగా రామచంద్రపిళ్లైతో పాటు అభిషేక్ రావు తో కలిసి కల్వకుంట్ల కవిత తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత ఢిల్లీ వెళ్లేందుకు కవితకు ఛార్టెట్ ఫ్లైట్ సిద్ధం చేసింది ఈ అభిషేక్ రావే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పలు కీలక ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో కవితకు ఉచ్చు బిగిస్తోందా? అనే ప్రచారం తెరపైకి వస్తోంది.

అమెరికాకు కవిత?:

కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడుగా ప్రచారం జరుగుతున్న అభిషేక్ రావు అరెస్ట్ తో కవిత ఎక్కడ ఉన్నారనేదానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. 'అక్క జంప్ అంట కదా, అమెరికా కి? నిజమా? అంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఓ వీడియోను ఈ సందర్భంగా షేర్ చేస్తూ అర్వింద్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ట్వీట్ కవితను ఉద్దేశించే చేశారా అనేది అర్వింద్ స్పష్టత ఇవ్వకపోయినా ఆమె అమెరికాకు వెళ్లిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కీలకమైన కేసు విచారణలో భాగంగా కవితకు సన్నిహితుడిగా చెప్పబడుతున్న వ్యక్తి అరెస్ట్ కావడంతో ఆమె ఎక్కడ ఉన్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రచారం జరుగుతున్నట్లుగా ఆమె నిజంగానే అమెరికాకే వెళ్లారా? లేక ఇక్కడే ఉన్నారా? అనేది తెలియాలంటే కవిత లేదా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed