Ameenpur: జీవ వైవిధ్యం.. దారుణ విధ్వంసం! కబ్జాలతో విలవిల్లాడుతోన్న వలస పక్షుల విడిది

by Shiva |
Ameenpur: జీవ వైవిధ్యం.. దారుణ విధ్వంసం! కబ్జాలతో విలవిల్లాడుతోన్న వలస పక్షుల విడిది
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్‌చెరు: దేశంలోనే తొలిసారిగా అమీన్‌పూర్ పెద్ద చెరువును రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య సరస్సుగా గుర్తించింది. 2016లో ప్రపంచ దేశాల వలస పక్షులకు విడిదిగా పేరుగాంచిన ఆ చెరువు అక్రమార్కుల చేతుల్లో చిక్కి భారీ విధ్వంసానికి గురైందని చెప్పవచ్చు. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం.. సుమారు 452 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును 2016లో అప్పటి ప్రభుత్వం జీవవైవిధ్య చెరువుగా గుర్తింపునిచ్చింది. ప్రపంచ దేశాల నుంచి 166 రకాల పక్షుల విడిదిగా ఉన్న చెరువును రక్షించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బిజీగా ఉన్న తేజ్‌దీప్ కౌర్ తీవ్రంగా శ్రమించింది. ఒకప్పుడు అహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్‌గా ఉన్న అమీన్‌పూర్ పెద్ద చెరువు తన రూపును కోల్పోయి కబ్జా కోరుల చేతుల్లో విలవిల్లాడుతోంది.

చెరువును పూడ్చి ప్లాట్లుగా చేసి..

ఆమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ ప్రకృతి అందాలను, పక్షుల శబ్ధాలతో ప్రజలను ఆకర్షించిన పెద్ద చెరువు కబ్జా దారుల చేతుల్లో చిక్కి రోదిస్తోంది. ఈ చెరువు చుట్టూ పలు కాలనీలు వెలువడంతో పెద్ద చెరువుపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. రాత్రికి రాత్రి వందలాది లారీలతో మట్టిని నింపి చెరువును పూడ్చి ప్లాట్లు వేశారు. చెరువు మధ్యలో రోడ్డు వేసి చెరువును రెండు విభాగాలుగా విభజించారు. తమ ధనార్జన ధ్యేయంగా ఆ కబ్జాదారులు ఎఫ్‌టీ‌ఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ప్లాట్లను విక్రయించారు. తక్కువ ధరకు ప్లాట్లు దొరకడంతో చాలామంది సామాన్యులు ఈ చెరువులో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పెద్ద చెరువు పెద్ద ఎత్తున కబ్జాకు గురైన అప్పట్లో అధికారులు ప్రజాప్రతినిధులు తమకేం పట్టనట్లు వ్యవహరించారు. చెరువు పరిరక్షణకు నడుంబించాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పడి అప్పనంగా చెరువును కబ్జాదారులకు అప్పగించారు.

అక్రమ నిర్మాణాల లెక్క తేలింది..

చెరువుల పరిరక్షణకు నడుంబిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసింది. దానికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ని నియమించింది. చెరువులు, కుంటల కబ్జాల విషయంలో సీరియస్ మీదున్న హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కు‌పాదం మోపుతుంది. ఈ నేపథ్యంలో అమీన్‌పూర్ పెద్ద చెరువు అక్రమాలపై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇదే నెలలో రెండుసార్లు ‘హైడ్రా’ కమీషనర్ రంగనాథ్ స్వయంగా పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. పెద్ద చెరువులో అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై సీరియస్ అయ్యారు. మొదటి పర్యటనలో అక్రమాల లెక్క తేల్చాలని మున్సిపల్‌తో పాటు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించడంతో పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల లెక్క తీశారు. ఇప్పటి వరకు పెద్ద చెరువు ప్రాంతంలో సుమారుగా 200 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఆ అక్రమ నిర్మాణాలలో చాలా వాటికి అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. అదేవిధంగ ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన వ్యవహారం‌పై సైతం హైడ్రా దృష్టి సారించి విచారణ ముమ్మరం చేసింది.

‘హైడ్రా’ ఎంట్రీ‌తో గుబులు..

చెరువులు కుంటలు వరద కాలువల కబ్జాల విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటున్న హైడ్రా అమీన్‌పూర్‌లో ఎంట్రీ ఇవ్వడంతో అక్రమార్కులకు నిద్రపట్టడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అవసరమైతే 100 మంది ఇంజనీరింగ్ నిపుణుల సహాయంతో అమీన్‌పూర్ అక్రమాల లెక్క తెలుస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద చెరువు ప్రాంతంలో 200‌కు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. త్వరలో పెద్ద చెరువులో వెలిసిన నిర్మాణాల‌పై చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో పెద్ద చెరువును కబ్జా చేసి తమకు నచ్చిన రీతిలో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులో ప్లాట్లను కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న నిర్మాణదారులు ‘హైడ్రా’అంటేనే ఉలిక్కిపడుతున్నారు. అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుండడంతో చెరువును కబ్జా చేసి ప్లాట్లు విక్రయించిన కబ్జాదారులతో పాటు వాటిని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు, అడ్డదారిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు సైతం తమపై చర్యలు తప్పవంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా చెరువుల కబ్జాల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తూ కబ్జాదారుల ఆట కట్టిస్తున్న ప్రభుత్వం పెద్ద చెరువు కబ్జా పాపంలో భాగస్వాములైన అక్రమార్కులతో పాటు కబ్జాకు సహకరించిన అధికారుల లెక్క సైతం తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed