Amara Raja: మరో ఆరేళ్లలో ‘అమర రాజా’ ప్లాంట్ కంప్లీట్: మంత్రి శ్రీధర్ బాబు

by Shiva |
Amara Raja: మరో ఆరేళ్లలో ‘అమర రాజా’ ప్లాంట్ కంప్లీట్: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో ఆరేళ్లలో ‘అమర రాజా’ లీథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని, ఈ కంపెనీతో 3,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ పురోగతిపై అధికారులు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కంపెనీ చైర్మన్ జయదేశ్ గల్లాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంపెనీ మూడు దశల్లో 16 గిగావాట్ల సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. రూ.9,500 కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ కర్మాగారం మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించిందని, ప్రస్తుతం 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం కేటాయించిన 262 ఎకరాల భూమిలో రెండో, మూడో దశ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అమర రాజా ప్లాంటు నుంచి జాతీయ రహదారి వరకు 3 కి.మీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికపై భూసేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్లాంటుకు అవసరమైన 220 కిలోవాట్ల విద్యుత్తు లైన్ నిర్మాణం, రోజుకు 5 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ)నీరు అవసరముండగా 1.5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు సంబంధించిన పనులు సైతం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజీ డైరెక్టర్ వింగ్ కమాండర్ డాక్టర్ సూర్యకాంత్ శర్మ, అమర రాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య, ప్రెసిడెంట్ విజయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed