జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి కేటాయించండి : సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

by Shiva |
జాతీయ రహదారుల నిర్మాణానికి భూమి కేటాయించండి : సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ ఏర్పడే నాటి వరకు దాదాపు 66 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కి.మీ పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, అదే 2014 తర్వాత నుంచి ఈ తొమ్మిదిన్నరేళ్లలో 2,500 కి.మీ పొడవున జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘భారతమాల పరియోజన’ కార్యక్రమం కింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు మరింత భూమి అవసరముందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు.

అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు 50 శాతం నిధులను సైతం జమజేయలని మరో లేఖ రాశారు. ఇప్పటి వరకు నిర్మించిన 2500 కి.మీ హైవే కాకుండా రాష్ట్రంలో మరో 2,500 కి.మీ పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. అందులో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కి.మీ పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో (మంజూరు చేయబడినవి/బిడ్డింగ్ దశలో ఉన్నవి/మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నవి) ఉన్నాయని తెలిపారు.

ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి (రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరభాగంతో సహా) అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ చేపట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.26,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ నగరం చుట్టూ 350 కి.మీ. పొడవున నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుందని తెలిపారు.

భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం జరిగిందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డులోని ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించవలసిన 50 శాతం నిధులు రూ.2,585 కోట్లను త్వరగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను త్వరగా కేటాయించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed