గురుకులాల్లో ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వ తీరుపై ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆగ్రహం

by Mahesh |
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వ తీరుపై ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, గురుకుల పాఠశాలల్లో నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పాము కాటుతో, అనుమానాస్పద స్థితిలో కొందరు విద్యార్థులు మరణించడం బాధాకరమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల విద్యార్థుల పై, వారి సంక్షేమం పై అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాలు సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు గుర్తించాలని, నాసిరకం, కల్తీ వస్తువుల ఉపయోగం, తాగునీరు కలుషితం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని వారు పేర్కొన్నారు. గురుకులాలు ,సంక్షేమ హాస్టళ్లలో పారిశుధ్యం లోపించి పాములు, ఎలుకలు హాస్టల్ లోకి రావడం వల్ల విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు.

గురుకుల పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లేదని విద్యార్థుల సంక్షేమం పై వారి దృష్టి లేకుండా పోతోందని విమర్శలు చేశారు. ప్రభుత్వం కేటాయించే నిధులు సక్రమంగా విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాలని, అద్దె భవనాల్లో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు నిర్వహణలో ఉండటం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు ప్యూరిఫైడ్ తాగునీరు అందించాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా బిల్లులు విడుదల చేయాలన్నారు. గురుకుల పాఠశాలలో ఇష్టానుసారంగా ప్రవేశపెట్టిన బడి సమయం మార్పు చేసి పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే అవగాహన సదస్సులు మతపరమైన వ్యక్తులతో నిర్వహించవద్దని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ఎప్పుడని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి గురుకుల పాఠశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష చేసి పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story