గురుకుల అభ్యర్థులకు హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలి.. ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ డిమాండ్

by Javid Pasha |
గురుకుల అభ్యర్థులకు హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలి.. ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల నియామక బోర్డు అభ్యర్థులందరికీ హెలికాప్టర్ సౌకర్యం ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ యువజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎందుకంటే జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేటాయించిన మల్టీపర్పస్ (ఒకే అభ్యర్థి మూడు పరీక్ష సెంటర్స్ లో రాయడం) పరీక్ష విధానంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని అందుకే సెంటర్లకు తొందర వెల్లేందకు హెలికాప్టర్ సదుపాయం కావాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం మాసాబ్ ట్యాంక్ లో ఉన్న గురుకుల భవన్ వద్ద ఉన్న గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య బట్టు కార్యాలయ ఆవరణలో యువజన సంఘాలు అభ్యర్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం గురుకుల బోర్డ్ డిప్యూటీ కార్యాదర్శికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. గురుకుల విద్యాలయాల్లో జేఎల్, డీఎల్, టి.జి.టి, పి.జి.టి, లైబ్రేరియన్ ఉద్యోగ నియామక పరీక్షల కోసం ఆగస్టు 1 నుంచి 23 వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పరీక్ష విధానంలో ఒకే అభ్యర్థికి మూడు, నాలుగు సెంటర్స్ కేటాయించడం.. నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నదని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో గత రెండు వారాలుగా భారీ వర్షాలు పడి నీటితో అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల్లో దుర్భర స్థితి నెలకొన్నదని, ఈ సందర్భంలో గురుకుల బోర్డు తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంలా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా గురుకుల అభ్యర్థులకు పూర్తి స్థాయిలో హాల్ టికెట్లు అందలేదని, ఇంటర్నెట్ సర్వర్ నిలుపుదల కావడం కారణంగా వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు నమోదు చేసుకున్నా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావడంలేదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed