Suspend : విధుల్లో సమయపాలన పాటించని వ్యవసాయశాఖ అధికారి సస్పెండ్

by Bhoopathi Nagaiah |
Suspend : విధుల్లో సమయపాలన పాటించని వ్యవసాయశాఖ అధికారి సస్పెండ్
X

దిశ నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్దుల్ మన్నన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు. శనివారం ఉదయం వ్యవసాయ శాఖ జేడీఏ కార్యాలయంలో రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేక గ్రీవెన్స్ కౌంటర్లు ప్రారంభించేందుకు కలెక్టర్ వెళ్లారు. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి విధులకు హాజరు కాలేదు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని పేర్కొంటూ సస్పెండ్ చేశారు. అంతేకాక అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్దుల్ మన్నన్‌ గత మూడు రోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారు. శనివారం జేడీఏ ఆఫీసుకు కలెక్టర్ వస్తున్నారని సమాచారం ఉన్నా డ్యూటీకి ఎగనామం పెట్టడంతో వేటుపడింది. కాగా, ఉద్యోగులు విధులకు హాజరుకావడంలో సమయపాలన పాటించడం లేదని సీఎం సహా మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయినా కొంతమంది అధికారుల్లో మార్పు రావడం లేదు. ఆలస్యంగా విధులకు రావడం.. సమయానికంటే ముందే ఇంటిబాట పడుతున్నారు. ఇలాంటి అధికారుల పట్ల కలెక్టర్లు సైతం కొరఢా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే విధులకు గైర్హాజరైన వ్యవసాయ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story