హోటల్ కోహినూర్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారుల ఆందోళన

by Kavitha |
హోటల్ కోహినూర్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారుల ఆందోళన
X

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తమ సామాగ్రిని తీసుకువెళ్లారంటూ వారు ఆరోపించారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో హోటల్ కోహినూర్‌కు ఎదురుగా గత కొంతకాలంగా ఫుట్ పాత్ పై పదుల సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ ఇతర దుకాణాలు వెలిశాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఫుట్ పాత్ పై దుకాణాలు తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడికి వచ్చే వాహనదారులపై కూడా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నా రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టీఎస్ఐఐసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో హోటల్ కోహినూర్ వద్ద ఫుట్ పాత్ పై వెలసిన దుకాణాలను తొలగించి, సామాన్లను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు. అక్కడే ఫుట్ పాత్ పై హోటల్ నిర్వహిస్తున్న కుమారీ ఆంటీకి ఓ న్యాయం, మాకో న్యాయమా అంటూ ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ సామాగ్రిని తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు. మా సామాగ్రి మాకు ఇవ్వాలంటూ నిరసనకు దిగారు.

Next Story

Most Viewed