మినరల్ కాదు.. అంతా జనరలే.. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ప్లాంట్‌లు

by Disha Web Desk 23 |
మినరల్ కాదు.. అంతా జనరలే.. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ప్లాంట్‌లు
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ తో పాటు, కాగజ్ నగర్ రెండు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్యూరిఫై వాటర్ పేరుతో సాధారణ నీటిని సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 80 కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా ఇందులో కొన్నింటికి తప్ప మిగతా ఏ వాటర్ ప్లాంట్లకు ఎస్ఎస్ఐ, ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ అనుమతులు లేకున్నా రోజు వేల లీటర్ల వాటర్ విక్రయించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నీటిని తాగిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

మినరల్ మాటున దందా..

మినరల్ వాటర్ పేరుతో వాటర్ ప్లాంట్ల యాజమాన్యాలు నీటిని శుద్ధి చేయకుండానే క్యాన్ల లో నింపి, నీళ్ల దందా చేస్తున్నారు. నీటి నిల్వ చేసే వాటర్ ట్యాంక్ లను నెలల తరబడి శుభ్రం చేయకుండా వాడటం తో నాచు పేరుకుపోయి అధ్వాన్నంగా మారాయి. కాగా నీటిని శుద్ధి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం తేదీ వివరాలను క్యాన్ల పై స్టిక్కర్ చేయాల్సి ఉన్నా, ప్లాంట్ యాజమాన్యం ఎవరు పాటించడం లేదు. ప్లాంట్ వద్ద అర్హత గల ల్యాబ్ టెక్నీషియన్ ఉండి రోజూ నీటిని పరీక్షించి కాలుష్యం, మెగ్నీషియం ఎంత మోతాదులో ఉందో పరీక్షించిన తర్వాత నీటిని సరఫరా చేయాలి. కానీ అవేమీ లేకుండా కొందరు అపరిశుభ్రమైన నల్లాల ద్వారా వచ్చే నీటిలో రుచికరమైన కెమికల్స్ కలిపి నీళ్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు..

వాటర్ ప్లాంట్లు ఐఎస్ఐ అనుమతి పొందాలంటే 1 లక్ష వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా పర్యవేక్షణ కొరకు పది వేలు, సంవత్సరానికి ఒక్కసారి రెన్యువల్ కోసం 50 వేల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా ప్లాంట్ల నిర్వాహకులు సంబంధిత శాఖలోని కొంతమంది అధికారులకు ముడుపులు చెల్లించి. ఇష్టానుసారం నీటి విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి, యాజమాన్యం పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లను చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.

Next Story

Most Viewed