Collector Kumar Deepak : అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి

by Sridhar Babu |
Collector Kumar Deepak : అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి
X

దిశ, మంచిర్యాల : జిల్లాలోని మండలాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వర‌గా పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాల‌న్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను పరిశీలించాల‌న్నారు. నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని స్ప‌ష్టం చేశారు. నివేదిక ఆధారంగా బిల్లులు చెల్లిస్తామ‌ని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు ఉన్నాయని,

రూఫ్ లీకేజీ ఉన్న గదులలో విద్యార్థులకు తరగతులు నిర్వహించవ‌ద్ద‌న్నారు. మిషన్ భగీరథ ద్వారా పాఠశాలలకు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక అధికారులు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సౌకర్యాల నిర్వహణ పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పిల్లల హాజరు శాతం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వర్షపు నీటి నిల్వలు లేకుండా తొలగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫర్టిలైజర్ షాపులను సందర్శిస్తూ స్టాక్ నిల్వలు, రిజిస్టర్లు, విక్రయాలను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం మండలాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.



Next Story