- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లీకేజీల మిషన్ భగీరథ..
దిశ, లక్షెట్టిపేట : తరచూ లీకేజీ సమస్యతో లక్షెట్టిపేట పురపాలకంలోని మిషన్ భగీరథ పథకం అభాసుపాలవుతోంది. దీనికి తోడు మంచినీటి సరఫరా పైప్ లైన్ ను పైపైనే ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీస్తోంది. లోపాన్ని గుర్తించి అధ్యయనం చేసి లీకేజీల సమస్యను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరచూ లీకేజీలతో మంచినీటి సరఫరా కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరమ్మతులతో లీకేజీలు సరి చేసినా.. ఏదో ఒకచోట తిరిగి సమస్య ఏర్పడుతోంది. పురపాలకంలో 15 వార్డులు ఉండగా, సుమారు 25 వేల జనాభా ఉంది. ఇక్కడ మిషన్ భగీరథ పథకం ద్వారా పైపు లైన్ ను విస్తరించి ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇచ్చారు. కాగా పీఎల్ఆర్ అనే సంస్థ దీనికి కాంట్రాక్టర్ పనులు చేయాల్సి ఉండగా సబ్ కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులు జరిగాయని తెలుస్తోంది.
అక్కడక్కడ పైపైనే పైపులైన్ వేసి పైపులైన్ ను విస్తరించారు. కనీసం గా మీటర్ లోతు వరకైనా తవ్వించి పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. తక్కువ లోతులోనే తవ్వి పైప్ లైన్ వేయడం విమర్శలకు దారితీస్తోంది. కల్వర్టులు ఉన్నచోట పైప్ లైన్ వేసి గాలికి వదిలేశారు. హెచ్డీఎ ఫ్ పైపులు కావడంతో ఏదేని భారీ వాహనం కల్వర్టుల వద్ద ఆ పైపుల మీదుగా మీదుగా వెళ్తే ఇక అంతే సంగతులు. వాహనం ఎక్కితే పైప్ లైన్ పగిలిపోయి మంచినీటి సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉంది. పురపాలకం లోని 12వ వార్డు మస్తాన్ గూడ, కోర్టు ఏరియాలో, 5వ వార్డు గోదావరి రోడ్ లో విలీన గ్రామమైన ఇటిక్యాలలో, 13వ వార్డులోని మండల పరిషత్ రోడ్డు, క్లబ్ రోడ్డులో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ కల్వర్టు వద్ద పైప్ లైన్ పైనే కనిపిస్తోంది. ఇక్కడ ఏదేని భారీ వాహనం వెళ్తే పగిలిపోయే పరిస్థితి నెలకొంది.
లీకేజీల ద్వారా భగీరథ నీరు వృధాగా పోతుండగా, లీకేజీ ల వద్ద నీరు కలుషితమై అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భగీరథ పథకం విజయవంతమై మంచినీరు సక్రమంగా సరఫరా అయితే సంబంధిత కాంట్రాక్టు సంస్థ నిర్వహణ బాధ్యతను పురపాలకానికి అప్ప జెప్పాల్సి ఉంటుంది. ఆయితే పురపాలక అధికారులు, పాలకవర్గం దాని నిర్వహణ పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తోంది. కొత్తగా ఏర్పడిన ఈ పురపాలకానికి వచ్చే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయ్యానికి తగ్గ ఆదాయ మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్న పురపాలకానికి లీకేజీలతో అస్తవ్యస్తంగా ఉన్న మిషన్ భగీరథ నిర్వహణ భారాన్ని ఎత్తుకోవడం మరింత భారమవుతుందని పాలకవర్గం భావిస్తోంది.
దీంతో వచ్చే ఆదాయంలో నుంచి సగ భాగం లీకేజీ మరమ్మతులకే ఖర్చు చేస్తే పురపాలకంలోని మిగతా సమస్యలను ఎలా పరిష్కరించేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైప్ లైన్ ఏర్పాటు విస్తరణలోని లోపాలను గుర్తించి మరమ్మతులు చేసి లీకేజీ సమస్యలు లేకుండానే అప్పజెబితేనే మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను చేపట్టేందుకు సిద్ధమని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం అంటోంది. లీకేజీల సమస్య లోపాన్ని గుర్తించి సక్రమ మంచినీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై లక్షెట్టిపేట మిషన్ భగీరథ ఇన్చార్జి ఏఈ అబ్రహం ను "దిశ " సంప్రదించగా పురపాలకంలో ఎక్కడెక్కడ లీకేజీ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి వచ్చిందన్నారు. లీకేజీల లోపాన్ని గుర్తించి సమస్య లేకుండా చేస్తామన్నారు.