- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతపై నకిలీ విత్తనం పడగ..?
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగంపై నకిలీ పత్తి విత్తనాల నీడ పడుతుంది. ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ లో రైతులు పత్తి విత్తనాల కోసం నానా అగచాట్లు పడుతున్న విషయం తెలిసిందే. తొలకరికి ముందే విత్తనాలు అందజేయాల్సిన వ్యవసాయ శాఖ జాప్యం చేస్తుండడంతో రైతులు ఇతర ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అమాయక రైతుల ఆసరాగా వ్యాపారులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నప్పటికీ రహస్యంగా దాచే నకిలీ పత్తి విత్తనాల గోదాములను చేధించ లేకపోతున్నారు. దీంతో నకిలీ విత్తనాల మాయలో పడి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 10 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ఇందుకు సరిపడా ప్రభుత్వం పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నప్పటికీ వర్షాకాలం తొలకరి నాటికి అందించకుండా జాప్యం చేస్తుండడం వల్లనే రైతులు సకాలంలో విత్తనాలు వేసే క్రమంలోనే నకిలీ విత్తనాల బారిన పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలనే నాణ్యమైన విత్తనాలుగా చూపుతూ రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర నుంచే నకిలీ బీటీ త్రీ పత్తి విత్తనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి యదేచ్చగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి నకిలీ పత్తి విత్తనాల దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం చర్యలకు ఆదేశం ఇచ్చినప్పటికీ పలుచోట్ల వ్యవసాయ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు ఉండకుండా జాగ్రత్త పడుతున్న వ్యాపారులు రైతుల డిమాండ్ను ఆసరాగా తీసుకుని రహస్య గోదాముల నుంచి రైతులకు అంటగడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ కఠినంగా వ్యవహరించ లేకపోతున్నారు. పోలీసులు విజిలెన్స్ యంత్రాంగం రంగంలోకి దిగితేనే అడ్డుకట్ట పడుతుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బోరజ్, బెల్ తారోడా, గో యగాం తదితర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లతోపాటు మహారాష్ట్ర సరిహద్దుల గుండా తెలంగాణలోకి ప్రవేశించే చిన్నచిన్న రహదారులపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తే గాని అక్రమ పత్తి విత్తనాల చొరబాటుకు అడ్డుకట్ట వేయలేమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ నాలుగు ప్రాంతాల నుంచి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు ప్రధాన కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా రైతులతో పాటు తెలంగాణలో పత్తి సాగు చేసే పలు జిల్లాలకు నకిలీ విత్తనాలు సరఫరా జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతానికి కూడా నకిలీ పత్తి విత్తనాలు జోరుగా రవాణా అవుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని బైంసా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ కేంద్రాలుగా నకిలీ బీటీ విత్తనాలు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయన్న సమాచారం ఉంది. పోలీసు వ్యవసాయ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ శాఖలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తే గాని నకిలీ బీటీ పత్తి విత్తనాల దందాను అరికట్టలేమన్న అభిప్రాయాలు రైతు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.