రాత్రి వేళ గుప్పుమంటున్న గంజాయి సిగరెట్లు..?

by Aamani |
రాత్రి వేళ గుప్పుమంటున్న గంజాయి సిగరెట్లు..?
X

దిశ,మందమర్రి : గత కొంతకాలంగా మందమర్రి పట్టణంలో రాత్రి వేళ గంజాయి సిగరెట్లు గుప్పుమంటున్నాయి. ఒకపక్క గంజాయి నియంత్రణ కొరకు పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న మరోవైపు గంజాయి క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతూనే వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి. గత ఆరు సంవత్సరాల క్రితం మందమర్రి పోలీస్ సర్కిల్ దేవాపూర్, కాసిపేట, మందమర్రి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 100 మంది గంజాయి సేవించే వారు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య పదింతలు పెరిగినట్లు సమాచారం. గతంలో గంజాయి కి బానిసలైన యువకుల కుటుంబ సభ్యులతో అప్పటి స్థానిక సీఐ ఎడ్ల మహేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మళ్లీ ఇలాంటి కౌన్సిలింగ్ లకు ఏ అధికారులు చొరవ చూపకపోవడంతో యువత విచ్చలవిడి విధానానికి శ్రీకారం చుట్టిందనే చెప్పవచ్చు.

ఒర్రెగడ్డ, ఎమ్మెల్యే కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్లలో అడ్డాలు

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒర్రెగడ్డ, ఎమ్మెల్యే కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్లలో రాత్రివేళ అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్న యువత గంజాయి మత్తులో మునిగితేలుతోంది. పగటివేల పోలీసుల గస్తీ ఉంటుందని భావించిన గంజాయి ప్రియులు రాత్రి పదిన్నర నుంచి ఒకటి వరకు ఆడ్డాలను ఏర్పాటు చేసుకొని మధ్యవర్తుల ద్వారా రూ. 70 కి కొనుగోలు చేసిన సిగరెట్ ను ఇద్దరు, ముగ్గురు తాగుతున్నట్లు సమాచారం.

మార్కెట్, పాల చెట్టు, పాత బస్టాండ్ లో ధూమపాన ప్రియులు

జనసంచార స్థలాలు ధూమపానం సేవించరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ స్థానిక పోలీసులు వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని తెలుస్తోంది. జనసంచారం ఎక్కువగా ఉన్న మందమర్రి మార్కెట్, పాల చెట్టు, పాత బస్టాండ్ లలో టీ,కాఫీ సేవించేందుకు వస్తున్న వారికి ధూమపానం ప్రియులు తాగి ఊదుతున్న పొగ తాకిడికి గురవుతున్నారు. చాయ్ కొట్టు వ్యాపారం చేస్తున్న యజమానులు ధూమపానం సేవిస్తున్న యువకుల తాకిడి ఎక్కువ కావడంతో ఒక సిగరెట్ కి రెండు రూపాయల అధిక రుసుం వసూలు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు.

పోలీసులు దృష్టి సారించాలి

జనసంచార వ్యాపార సముదాయాల ప్రాంతాల్లో ధూమపానం సేవిస్తున్న యువతను స్థానిక పోలీసులు కట్టడి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కనీసం 20 సంవత్సరాలు వయస్సు కూడా లేని కాలేజీ విద్యార్థులు అధిక శాతం ధూమపానానికి బానిసలు అయినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతాలలో జీవిస్తున్న వారికి డబ్బులకు కొదవలేదు. విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద డబ్బులు ఉండడంతో ధూమపానం, గంజాయి, మద్యం, తదితర చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారు. ధూమపానం సేవిస్తున్న అడ్డాలను గుర్తించి సగరు వ్యక్తులపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story