- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ మంత్రి గడ్డం వినోద్ పయనమెటు..?
దిశ ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దివంగత వెంకటస్వామి తనయుడు మాజీ మంత్రి గడ్డం వినోద్ రాజకీయ అంతరంగం ఏమిటన్నది బయటపడడం లేదు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఆయన గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతమైన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2004లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
వినోద్‌కు కలిసిరాని రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీలో గొప్ప చరిత్ర ఉన్న వెంకటస్వామి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వినోద్ తొలిసారి పోటీ చేసి గెలుపొంది మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయాలు కలిసి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి దుర్గం చిన్నయ్యకు గట్టి పోటీ ఇచ్చారు. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పార్టీలో ఉన్న విభేదాలు ఆయనను డోలాయమానంలో పడేసింది.
తూర్పు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు... వినోద్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారన్న ప్రచారం ఉంది. తూర్పు జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన జోడో యాత్రకు వినోద్ దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన వినోద్ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న సీఎల్పీ నేత యాత్రకు వెళ్ళకపోవడం గమనార్హం.
కాంగ్రెస్లో ఉంటారా...వీడుతారా..?
మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లి లేదా చెన్నూరు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ఆయన ఆ పార్టీలో ఉంటారా లేదా బయటకు వెళ్తారా అన్నది తేలడం లేదు. వచ్చే వారం ఆయన బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడకుండా పనిచేసినప్పటికీ తనకు గుర్తింపు ఇవ్వకపోవడంపై వినోద్ ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలను బట్టి ఆయన పోటీ చేయడం ఖాయం అని చెబుతున్నప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
తమ్ముడి వెంట నడుస్తారా..!
మాజీ పార్లమెంటు సభ్యుడు బీజేపీ సీనియర్ నేత, తన సోదరుడు గడ్డం వివేక్ వెంకటస్వామి దారిలోనే మాజీ మంత్రి గడ్డం వినోద్ నడుస్తారా అన్నది ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపుతున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళితే సునాయాసంగా విజయం సాధించవచ్చన్న ప్రచారం మేరకు వినోద్ కాషాయం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం ఉంది. అయితే దీనిపై ఆయన ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం నిర్మల్‌లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే రాజకీయ పరిస్థితుల తారుమారులను బట్టి ఆయన కాంగ్రెస్‌కు దూరం అవుతారని ప్రచారం మొదలైంది. తన సోదరుడు వివేక్ పెద్దపల్లి పార్లమెంట్ లేదా చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రభావం వల్ల సునాయసంగా గెలుస్తారని వినోద్ సన్నిహితులు ఆయనకు సలహా ఇస్తున్నారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును వినోద్ ప్రకటించే అవకాశం ఉంది.