పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : కలెక్టర్ అభిలాష అభినవ్

by Aamani |
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : కలెక్టర్ అభిలాష అభినవ్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో 10వ తేదీ నుంచి చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తా రహదారి డివైడర్స్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. విద్యార్థులంతా పాఠశాల స్థాయి నుంచే పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ అన్నారు.

సమాజంలో మెరుగైన పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం ఆవశ్యకతను విద్యార్థులు కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పట్టణాన్ని స్వచ్ఛ నిర్మల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డీఈఓ పి. రామారావు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ హరి భువన్, అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed