పేదోడి సొంతింటి కల.. నెరవేరెనా..

by Sumithra |
పేదోడి సొంతింటి కల.. నెరవేరెనా..
X

దిశ, ఆసిఫాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు లేని పేదోడికి పక్కా ఇండ్లు కట్టిస్తాం.. పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఖర్చు భరించి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకు 2015-16, 17 లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1223 ఇళ్లను మంజూరు చేసింది. మంజూరైన ఇండ్లకు టెండర్లు పిలిచారు. 575 ఇండ్లకు టెండర్లు పూర్తి చేసిన అధికారులు పనులు గుత్తేదారులకు అప్పగించారు. ఎంతో ఉత్సాహంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు తమకు గిట్టుబాటు కాదంటూ ధరలు పెంచాలంటూ పేచీపెట్టి డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను నిలిపివేశారు.

జిల్లాలో ఇండ్ల నిర్మాణానికి నాటి ప్రభుత్వం రూ.33 కోట్ల నిధులు మంజూరు చేసింది. అందులో రూ.18 కోట్లు ఖర్చు చేసి పనులను చేపట్టిన అధికారులు ఆదిలోనే కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని ఆశపడి ఎదురు చూసిన లబ్దిదారులకు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల 9 సంవత్సరాలు దాటిన కూడా ఇండ్లు పూర్తి కాలేదు. పనులు ఆగిపోయిన అప్పటి ప్రభుత్వ పాలకులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయించాలనే ఆలోచన చేయకపోవడంతో పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది. జిల్లాలో 1223 ఇండ్లు మంజూరైతే అందులో కేవలం 26 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక మిగిలిన వాటి గురించి అధికారులు గానీ, ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

మొత్తం ఇండ్లు మంజూరైనవి 1223 కాగా టెండర్ అయినవి 575 ఇండ్లు. అందులో పూర్తయింది 26, ముగింపు దశలో 270. వివిధ దశలో 339 ఇండ్లు ఉన్నాయి. ఇందులో కాగజ్ నగర్ 192, రెబ్బెన లో 30, ఆసిఫాబాద్ లో16 ప్రైవేటు భూమిలో ఇండ్ల నిర్మాణం చేపట్టారని, 238 ఇండ్లకు సంబంధించి కోర్టు కేసు విచారణలో ఉంది. మిగిలిన పనులు ప్రారంభానికి నోచుకోలేదని అధికారులు తెలుపుతున్నారు. సీర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎంతో కొంత పురోగతి కనిపిస్తున్నా.. ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతి కనిపించటం లేదు. మరి ఈ ప్రభుత్వమైనా పేదలను పట్టించుకుంటుందా లేదా వేచి చూడాలి మరి.

అధికారుల లెక్కల ప్రకారం..

జిల్లాలోని 15 మండలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 23.238 మంది సొంత ఇళ్లు లేని అభాగ్యులు ఉన్నారని సమగ్ర సర్వే అధికారులు గుర్తించారు. 1 లక్ష 47 వేల 606 గృహాలు ఉండగా, 44 వేల 618 మంది ప్రభుత్వ సహాయంతో గతంలో ఇళ్ల నిర్మాణం జరిగింది. అలాగే 79 వేల 750 మంది సొంత ఖర్చుతో ఇళ్లను నిర్మించుకున్నారు. 14 వేల 804 కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. 8 వేల 381 కుటుంబాలు పూరిగుడిసెల్లో నివాసం ఉంటుండగా.. మరో 53 మంది కుటుంబాలు ఎలాంటి గూడు లేకపోవడంతో ఆరుబయట ఖాళీ స్థలంలో టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసుకొని తాత్కాలిక షెడ్లలో కాలం వెళ్లదీస్తున్నారు.

కొత్త సర్కార్ పైనే లబ్ధిదారుల ఆశలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన నాయకులు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల కాలంలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మాకు ధరలు గిట్టుబాటు కావు, మాకు ధరలు పెంచండి అంటూ కాంట్రాక్టర్లు పనులు ఆపివేస్తే వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించా లనే ఆలోచన చేయక పోవడం విచారకరం. పేదోడే కదా మాకెందుకు అనే వైఖరిని నాయకులు అవలంభించారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. పాలకులు మారారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు ఎన్నికల హామీలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇస్తారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయినా పేదలకు పక్కాఇండ్లు వస్తాయని లబ్ధిదారులు గంపెడు ఆశతో ఉన్నారు.

Next Story

Most Viewed