సమగ్ర విచారణతో నేరస్తులకు శిక్షపడేలా చూడాలి : పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్

by Sumithra |
సమగ్ర విచారణతో నేరస్తులకు శిక్షపడేలా చూడాలి : పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్
X

దిశ‌, మంచిర్యాల : స‌మ‌గ్ర విచార‌ణ‌తో నేర‌స్తుల‌కు న్యాయ స్థానం ద్వారా శిక్ష ప‌డేలా చూడాల‌ని రామ‌గుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పోలీసు అధికారుల‌కు సూచించారు. మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విచార‌ణ‌లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచార‌ణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసు విచార‌ణ చేయాలన్నారు.

బాధతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పిటిషన్ లకు వెంటనే స్పందించాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి దరఖాస్తును స‌రైన రీతిలో విచార‌ణ చేసి, విచార‌ణ నివేదిక‌ను ఆన్లైన్లో పొందుప‌ర‌చాల‌ని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్ల పై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా ముఖ్యం అని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలతో మంచి సత్ససంబందాలు కలిగి ఉండాలి అప్పుడు సమాచారం వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేంటనే ఘటన స్థలంకి వెళ్ళాల‌ని, పరిస్థితులు అదుపులో ఉండేలాగా చూడాలని అధికారుల‌ను కోరారు.

ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు నిందితులకు శిక్ష పడేలా నేర సంఘటనలో జరిగిన నిజం చెప్పేలాగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్), ప్రమాదాలకు గల కారణాలను గుర్తించాలన్నారు. వాటి నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తుపదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, ముఖ్యంగా గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి పై పీడీ యాక్ట్ కింద‌ నమోదు చేయాలని సీపీ శ్రీ‌నివాస్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏసీపీలు రాఘవేంద్ర రావు, ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవి కుమార్, నరసింహులు, మంచిర్యాల జోన్ సీఐలు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు, సీసీ ఆర్ బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, NIB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Next Story