- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సింగరేణి భూ సంబంధిత సమస్యలపై సమగ్ర విచారణ

దిశ, మంచిర్యాల : ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని సింగరేణి సంస్థ పరిధిలోని భూములకు సంబంధించి వచ్చే దరఖాస్తులపై రెవెన్యూ రికార్డులను సరి చూసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నెల రోజుల వ్యవధిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనునట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్లో రాజస్వ మండల అధికారి హరికృష్ణ, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల జనరల్ మేనేజర్లు శ్రీనివాస్, దేవేందర్, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజావాణి కార్యక్రమాన్ని మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని సింగరేణి పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించి వచ్చే దరఖాస్తులపై రెవెన్యూ రికార్డులను సరి చూసి సింగరేణి సంస్థ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి ఓపెన్కాస్టు ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని జైపూర్ మండలం గుత్తేదారుపల్లె గ్రామంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు నిబంధనల ప్రకారం అర్హులైన వారికి నష్టపరిహారం త్వరగా అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణకు పాల్పడిన అనర్హులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా తొలగించాలని తెలిపారు. నష్టపరిహారం కోసం తప్పుడు వివరాలతో వచ్చిన దరఖాస్తులపై తగు చర్యలు తీసుకోవాలని, సింగరేణి భూములు ఆక్రమణ గురైనట్లయితే సంబంధిత అధికారుల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక రూపొందించి, తద్వారా ఆక్రమణలు తొలగించే విధంగా సింగరేణి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ పరిధిలోకి వచ్చే భూములు, ఆస్తి పన్నులను ఎలాంటి బకాయి లేకుండా పూర్తిగా చెల్లించాలని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు సంతోష్, రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.