అవసరం లేని వస్తువులు సేకరించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం

by Aamani |
అవసరం లేని వస్తువులు సేకరించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం
X

దిశ, కూకట్​పల్లి: ఇండ్లలో నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులను సేకరించేందుకు కూకట్​పల్లి సర్కిల్​ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. సర్కిల్​ పరిధిలోని అన్ని డివిజన్​లలో కాలనీల వారీగా ప్రత్యేక వాహనం ద్వారా నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీ గంగాధర్​ మాట్లాడుతూ ఇండ్లలో అవసరం లేని నిరుపయోగంగా ఉన్న దుస్తులు, పాత ఫర్నిచర్​, ఎలక్ట్రానిక్​ వస్తువులలు ఏసీ, రిఫ్రిజిరేటర్​, వాషింగ్​ మిషన్​, పాత టీవీలు, పాత పుస్తకాలు, అవసరం లేని ఏ వస్తువులైన ఇవ్వవచ్చునని అన్నారు.

మొదటి రోజు సర్కిల్​ పరిధిలోని హైదర్​నగర్​ డివిజన్​ బృందావన్​ కాలనీ, కూకట్​పల్లి డివిజన్​ వెంకట్రావు​ నగర్​ కాలనీ, ఓల్డ్​బోయిన్పల్లి డివిజన్​ ఆర్​ఆర్​ కాలనీ, బాలానగర్​లలో ప్రత్యేక వాహనాల ద్వారా పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది వస్తువులను సేకరించడం జరిగిందని డీసీ గంగాధర్​ తెలిపారు. అదే విధంగా వచ్చే వారం కొన్ని కాలనీలను గుర్తించి వాటిలో వస్తువులను సేకరిస్తామని తెలిపారు. ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను ప్రజలు నాలాలలో, కాలనీ కూడళ్లలో పారేయడం జరుగుతుందని, వస్తువులను బయట పడేయకుండా తమ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్​ ఆఫీసర్​ శ్రీనివాస్​, ఎస్​ఆర్​పిలు సత్యనారయణ, వినయ్​కాంత్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed