మంత్రి ఇలాకాలో గులాబీ ముళ్లు..

by Mahesh |
మంత్రి ఇలాకాలో గులాబీ ముళ్లు..
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీలో భారీ కుదుపు ఏర్పడింది. సుమారు రెండు దశాబ్దాలుగా పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు నిర్మల్ నియోజకవర్గం టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి కే శ్రీహరి రావు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీరును తప్పు పడుతూ నిరసన గళం విప్పారు. పార్టీలో అంతా ఏకపక్ష నిర్ణయమే సాగుతోందని పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నాయకులను విస్మరించి పరకాయ ప్రవేశం చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీహరి రావు అధిష్టానానికి తన నిరసన లేఖను పంపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్ సారాంశం మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరుపైనే ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు పార్టీపై నిర్మల్ నియోజక వర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో ఉద్యమకారులకు విలువేది..?

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉద్యమకారులకు పార్టీ జెండా మోసిన నేతలు కార్యకర్తలకు అసలు విలువ లేకుండా పోయిందని శ్రీహరి రావు ఆక్షేపించారు. నిర్మల్ నియోజకవర్గంలో తనలాంటి నేతలతో పాటు కార్యకర్తలు ఉద్యమ కాలంలో పార్టీ కోసం పోరాడి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని వారిని కనీసం పలకరించేవారు లేకుండా పోయారని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు పాత వాళ్లను కలుపుకొని పోవాలని చెప్పినప్పటికీ నిర్మల్ నియోజకవర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే పెద్ద పీటవేసి ఉద్యమకారులను జండా మోసిన కార్యకర్తలను విస్మరించారని ధ్వజమెత్తారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీహరి రావు ఒకేసారి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరును నిరసిస్తూ మీడియాకు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. శ్రీహరి రావు అనూహ్య నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ నిర్ణయం ఒక కుదుపుకు లోను చేసింది.

అప్పుడు కాంగ్రెస్లో... ఇప్పుడు బీఆర్ఎస్లో..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా రాజకీయ వర్గాలకు పరిచయం ఉన్న శ్రీహరి రావు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రాజకీయాల్లో చురుకైన నేతగా ఎదిగారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శిష్యుడిగా పేరు ఉంది. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో నిర్మల్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని అప్పటికే అనేక పదవులు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి తనకు న్యాయం చేయాలని అధిష్ఠానం వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డితో శ్రీహరి రావుకు విభేదాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన శ్రీహరి రావు ఇంద్రకరణ్ రెడ్డి ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ లభించినప్పటికీ శ్రీహరి రావు ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీని వీడకుండా టిఆర్ఎస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు.

అయితే 2018 ఎన్నికల సమయంలో మళ్లీ టికెట్ ఆశించిన శ్రీహరి రావు టికెట్ రాకపోవడంతో తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లగా కేటీఆర్ స్వయంగా ఇద్దరినీ కూర్చోబెట్టి సముదాయించారు. కచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే పలు దఫాలుగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ వచ్చిన నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి తనకు అవకాశం ఇప్పించాలని శ్రీహరి రావు కోరుతూ వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సహకరించలేదని శ్రీహరి రావు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తన అనుచరులకు పార్టీ కోసం పని చేసిన అనేక మంది నేతలు కార్యకర్తలకు అధికార నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు దక్కడం లేదని కొన్నాళ్లుగా నిరాశతో ఉన్నారు. ఈ విషయాన్ని పలుసార్లు ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు అయినప్పటికీ తన వర్గీయులకు అవకాశం లభించకుండా పోవడాన్ని జీర్ణించుకోలేక శ్రీహరి రావు తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

తిరుగుబాటు తప్పదా..

శ్రీహరి రావు అనూహ్య నిర్ణయం పై రాజకీయ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌తో కుటుంబ సంబంధాలు కలిగి ఉన్న శ్రీహరిరావు పార్టీని వీడుతారా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోసారి తనకు టికెట్ ఇవ్వాలని అడిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుండగా... ఇంద్రకరణ్ రెడ్డి ని కాదని టికెట్ వచ్చే అవకాశం లేదని తాజా పరిణామాలు ఆయన పార్టీపై తిరుగుబాటు చేస్తారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలందరినీ సమీకరించి కొత్త కూటమి కి తెర లేపుతారని ప్రచారం జరుగుతోంది.

పార్టీపై తీవ్ర ప్రభావం..

శ్రీహరి రావు పార్టీని వీడితే అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలే స్వయంగా అభిప్రాయపడుతున్నారు. నిర్మల్ నియోజకవర్గం లో బలమైన పట్టున్న నేతగా ఆయనకు పేరు ఉంది నిర్మల్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పార్టీ బలోపేతం కోసం ఆయన పాటుపడ్డారు. ప్రధానంగా ఖానాపూర్ ఉట్నూర్ బోత్ ఆదిలాబాద్ ముధోల్ తదితర ప్రాంతాల్లో ఆయనకు ఇప్పటికే కొంత అనుచర గణం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి బంగపడే నేతలు శ్రీహరి రావుతో జత కట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రచారం మొదలైంది.

బుజ్జగింపు చర్యలు షురూ..

కాగా శ్రీహరి రావు నిర్ణయం పై అధికార భారత రాష్ట్ర సమితి అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ తూర్పు జిల్లాకు చెందిన ఒక యువ శాసనసభ్యునితో శ్రీహరిరావు మాట్లాడించినట్లు తెలిసింది. తాజా పరిణామాలు మీడియాలో ఇప్పటికే ప్రచారం కావడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలిసింది. అయితే ఇప్పటికిప్పుడే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలు అందరితో సమావేశం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని సన్నిహితుడు ఒకరు ‘దిశ ప్రతినిధి’కి తెలిపారు.

Advertisement

Next Story