KCR లెక్క ప్రకారం రూ.వెయ్యి కోట్ల కరప్షన్.. : షర్మిల

by Sathputhe Rajesh |
KCR లెక్క ప్రకారం రూ.వెయ్యి కోట్ల కరప్షన్.. : షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అవినీతి పాలన ఉందనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యానించారు. దళితబంధు స్కీమ్ అమలులో ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందంటూ స్వయంగా ఆయనే పార్టీ సమావేశంలో వెల్లడించినందున ఆ అవినీతిపరుల జాబితాను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కేసీఆర్ లెక్క ప్రకారం రాష్ట్రంలో దళితబంధు స్కీమ్ అమలులో వెయ్యి కోట్ల మేర అవినీతి జరిగినట్లు స్పష్టమవుతున్నదన్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ. 10 లక్షలు ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్నా అందులో రూ. 3 లక్షల మేర కమిషన్ రూపంలో నొక్కేస్తున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 4 వేల కోట్లలో వెయ్యి కోట్లకు పైగానే అవినీతిమయమైందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ కామెంట్ చేయడంతో ఇది అవినీతి ప్రభుత్వం అని తేలిపోయినట్లేనని ఆయనకు రాసిన ఓపెన్ లెటర్‌లో షర్మిల వ్యాఖ్యానించారు.

ఒకవైపు కమిషన్ల రూపంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని షర్మిల ఆ లేఖలో ప్రశ్నించారు. ఆ అవినీతిపరుల జాబితాను బట్టబయలు చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా సీఎం ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అవినీతికి పాల్పడితే కూతురైనా, కొడుకైనా వదిలేది లేదంటూ గతంలో చాలా గొప్పగా ప్రకటించారని, ఇప్పుడు ఎమ్మెల్యేలపై చర్యలకు ఎవరు అడ్డుపతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కొత్తలో చేసిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని కేసీఆర్‌ను ఆమె డిమాండ్ చేశారు. అవినీతి ఎమ్మెల్యేల లిస్టును బయట పెడితే వారు తెగిస్తారని సీఎం భయపడుతున్నారా అని ప్రశ్నించారు. వారి పేర్లను బయటపెడితే తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది రివర్స్ అవుతుందని కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారేమో అనే అనుమానాన్ని షర్మిల వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్లు తిన్నారంటూ వచ్చిన విమర్శలను ఆమె గుర్తుచేశారు. బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు రియల్ ఎస్టేట్ స్కాం గురించి అడుగుతారనే భయం ఉన్నదా అని ప్రశ్నించారు. కేసీఅర్ పేరు కరప్షన్ చంద్రశేఖర్ రావుగా మారిందని ఎద్దేవాచేశారు. కేవలం దళిత బంధు స్కీమ్‌లోనే అవినీతి జరిగిందా.. లేక ఇతర పథకాల్లోనూ ఇదే రిపిట్ అయిందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులని సీఎం స్టేట్‌మెంట్‌తో రుజువైందన్నారు.

కమీషన్లు మాత్రమే కాక ప్రభుత్వ భూముల కబ్జా కూడా జోడిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పెద్ద చిట్టాయే అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే ఎంతెంత తిన్నారో లెక్కలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అవినీతి ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యతగా కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పదవులకు రాజీనామా చేయాల్సిందేనన్నారు.

Advertisement

Next Story

Most Viewed