రైతులకు గమనిక.. పీఎం కిసాన్ కు ఆధార్ లింక్ చేశారా?

by Sathputhe Rajesh |
రైతులకు గమనిక.. పీఎం కిసాన్ కు ఆధార్ లింక్ చేశారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్​ యోజన ఆర్థిక సాయానికి నిబంధనలు మార్చారు. ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల ఆధారంగా పీఎం కిసాన్​ సొమ్మును బదిలీ చేస్తున్నారు. కానీ ఇక నుంచి నిబంధనలు మార్చారు. బ్యాంకు ఖాతా ఆధారంగా కాకుండా.. ఆధార్​ ఆధారంగా నగదు బదిలీ చేయనున్నారు. దీంతో రైతులకు ఈసారి మళ్లీ తిప్పలు మొదలయ్యాయి.

అనుసంధానం తప్పనిసరి

బ్యాంకు ఖాతాలకు చాలా మంది రైతులు ఇంకా ఆధార్​ అనుసంధానం చేసుకోలేదు. పాత అకౌంట్లకు ఆధార్​ అనుసంధానం అవసరం లేకపోవడంతో చిరునామాలు, ఇతర కార్డులతో బ్యాంకు ఖాతా ఓపెన్​ చేశారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆధార్​ కార్డు నెంబర్​ ఆధారంగానే కిసాన్​ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం ఉంటేనే.. సదరు రైతుల పేర్లు జాబితాలో ఉంటాయి. లేని పక్షంలో వారికి పీఎం కిసాన్​ సొమ్ము రాదు.

వాస్తవంగా పలు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రైతులు బ్యాంకు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం చేసుకోవడం లేదు. ఆధార్​ కార్డుకు ఇప్పటికే పాన్​ నెంబర్లు అనుసంధానం చేసి ఉండటంతో.. లావాదేవీలకు ఇబ్బందులు ఏర్పడుతాయనే అభిప్రాయాలున్నాయి. కానీ, కేంద్రం ఇప్పుడు ఇదే తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాకు ఆధార్​ అనుసంధానం ఉంటేనే.. కేంద్రం జాబితాలో ఆధార్​ కార్డు నెంబర్​ డిసిప్లే అవుతోంది. ఆధార్​ ఆధారంగానే వారికి పీఎం కిసాన్​ పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, బ్యాంకు ఖాతాలకు ఆధార్​ అనుసంధానం చేసుకుని, ఈ నెల 30లోగా వ్యవసాయాధికారుల దగ్గర అప్​డేట్​ చేయించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవంగా కొద్దిరోజుల కిందటే ఈ నిబంధనలు వచ్చినా.. ప్రచారం చేయలేదు. ఇప్పుడు చాలా మంది రైతులు ఖాతాలు ఆధార్​తో అనుసంధానం లేవని గుర్తించిన వ్యవసాయాధికారులు.. గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ నెల 30లోగా అప్​డేట్​ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని గ్రామీణ బ్యాంకులు దీనికోసం ఒకరిద్దరు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. ​

Advertisement

Next Story