TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. మొత్తం 5 పేపర్లు లీక్!

by GSrikanth |
TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. మొత్తం 5 పేపర్లు లీక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ మొత్తం 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేసినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ టీఎస్పీఎస్సీ అధికారులతో భేటీ అయ్యారు. పేపర్ లీక్ వ్యవహారంపై అధికారులు, సిబ్బంది ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకుంటున్నారు కాన్ఫిడెన్షియల్ రూం ఇంచార్జీ ప్రసన్నలక్ష్మిని నుంచి ప్రవీణ్ పాస్‌వర్డ్ చోరీ చేయడంపై సిట్ చీఫ్ ఆరా తీస్తున్నారు. అయితే, ప్రవీణ్‌కు లబ్ధి చేకూర్చేందుకు కంప్యూటర్ లాన్‌లో రాజశేఖర్ మార్పులు చేసాడని సిట్ వెల్లడించింది.

రాజశేఖర్ సహాయంతో ప్రవీణ్ పేపర్లు కొట్టేసినట్లు గుర్తించారు. ప్రవీణ్ చోరీ చేసిన 5 పేపర్లలో మార్చి 5వ తేదీన జరిగిన పరీక్షతో పాటు మరో 4 పేపర్లు పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్, బిల్డింగ్ ఓవర్సిర్ పేపర్, వెటర్నరీతో పాటు మరో పేపర్ లీకైందని సమాచారం. అలాగే జరగబోయే మరికొన్ని పేపర్లు సమయం చూసి ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చాడు. తన వద్ద పేపర్లను విక్రయించడానికి అభ్యర్థులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు ప్రవీణ్ సూచించాడని సిట్ విచారణలో తేలింది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ ఘటనతో ఈనెల 12,15,16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది.

Advertisement

Next Story