వారికి చెక్ పెట్టేలా పక్కా స్కెచ్! టీ - కాంగ్రెస్‌లో కర్ణాటక వ్యూహం..?

by Sathputhe Rajesh |
వారికి చెక్ పెట్టేలా పక్కా స్కెచ్! టీ - కాంగ్రెస్‌లో కర్ణాటక వ్యూహం..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఈసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలను పెట్టుకుంది. ఇన్నాళ్లు స్వరాష్ట్రం ఇచ్చిన పార్టీగా మైలేజ్ సాధించుకోలేకపోయిన హస్తం నేతలు.. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టి ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే టికెట్లు ఖరారు చేయాలనే డిమాండ్ పార్టీలో చాలా కాలంగా వినిపిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ కంటే కనీసం ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం వల్ల ప్రచారం చేసుకునేందుకు వీలుంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటకలో అమలు చేసిన స్ట్రాటజీనే తెలంగాణలో అమలు చేస్తే ఫలితం ఎలా ఉండబోతోందనే దానిపై పార్టీఅధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మే 10న జరగబోయే కర్ణాటక ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సర్వేలను ఆధారం చేసుకుంది. క్షేత్ర స్థాయిలో గెలుపు గుర్రాలను అన్వేషించే టికెట్లు కట్టబెడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కంటే ముందే అక్కడ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే ఎంపిక జరిగిందని అందువల్ల ఈసారి గెలుపు తమవైపే అనే ధీమాలో హస్తం నేతలు ఉన్నారు. ఇదే వ్యూహం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయడంపై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అధిష్టానం గ్రౌండ్ రిపోర్ట్ ను సిద్ధం చేసుకుంటోంది. పలు దఫాలుగా నేతల పనితీరును అంచనాకు వచ్చిన పార్టీ పెద్దలు పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేస్తూన్న వారిలో గెలుస్తారని భావించిన వారికే టికెట్లు కట్టబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలని సీనియర్ల నుంచి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లలో కొమ్ములు తిరిగిన నేతలు ఉన్నారు. తమ మాటే చెల్లుబాటు కావాలనే పట్టుపట్టే అసంతృప్తులు ఉన్నారు. అన్నింటికి తోడు హస్తం పార్టీలో నేతల మధ్య ఆధిపత్యపోరు షరా మామూలే అన్నట్లుగా తయారవుతోంది. ఇదంతా గమనించిన అధిష్టానం ఇన్ చార్జిని మార్చివేసింది. మాణిక్ ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు థాక్రేకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది.

ఇంత జరిగినా కొంత మంది నేతల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదనే చర్చ పార్టీ క్యాడర్‌లో వినిపిస్తోంది. కొత్త బాస్ ఇన్ చార్జిగా వచ్చాకే టీ కాంగ్రెస్ సీనియర్లు తలో దారిలో పాదయాత్రలు ప్రకటించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు విషయంలోనూ రాష్ట్ర నేతల స్పందన క్యాడర్‌ను సైతం విస్మయానికి గురి చేస్తోందనే టాక్ ఉంది. ఏదో స్పందించామా అన్నట్లుగానే నేతల తీరు కనిపించింది కానీ ఈ అంశంలో సీరియస్‌గా బీజేపీని కార్నర్ చేయడంలో రాష్ట్ర నేతలు విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొంత మంది సీనియర్లు రాహుల్ గాంధీ విషయంలో కనీసం స్పందించలేదని ప్రత్యర్థులు సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలో ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటికీ టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కొంత మంది సీనియర్ల అసంతృప్తి తొలగిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వేల పేరుతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్లు రాని అసంతృప్తులు పార్టీలోనే కొనసాగుతారా అనేది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక లాంటి సర్వే ఆధారిత అభ్యర్థుల ప్రకటన టీకాంగ్రెస్‌లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed