అసెంబ్లీలో నయా ట్రెండ్.. కొత్త ప్రభుత్వం తీరుపై ప్రశంసలు

by GSrikanth |
అసెంబ్లీలో నయా ట్రెండ్.. కొత్త ప్రభుత్వం తీరుపై ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ తొలి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరిని ఆకట్టుకుంటోంది. పాలనలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా అసెంబ్లీలోనూ గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా మాటల యుద్ధం జరగగా ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వైఖరి, సీఎం రేవంత్ రెడ్డి మాటలపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎంతో పాటు మంత్రులు సైతం రియాక్ట్ కావడం ఆసక్తిగా మారింది. గత ప్రభుత్వంలో అంతా కేసీఆర్ అన్నట్లుగా నడిచిందని అధికార పక్షం అంటే పూర్తిగా వన్ మ్యాన్ షో గా నడిపించారని కానీ కొత్త ప్రభుత్వంలో మాత్రం సీఎంతో పాటు మంత్రులు సైతం తమ స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తపరచడం శుభపరిణామం అనే చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాలకు అవకాశం:

గత ప్రభుత్వ హయాంలో సభలో ప్రతిపక్ష నేతలు తమ గళాన్ని వినిపించే అవకాశం తక్కువగా ఉండేదని ఇవాళ జరిగిన సభలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపించిందనే టాక్ వినిపిస్తోంది. అధికార పక్షం నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు, ఎంఐఎం, బీజేపీ, సీపీఐ లకు స్పీకర్ మాట్లాడే అవకాశం కల్పించారు. కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కే ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని ఒక దశలో మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని చెప్పారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు తాము ఎప్పుడు స్వీకరిస్తామని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో కేసీఆర్ సైతం ఇదే తరహాలో ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తామని చెప్పినా ఆచరణలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అనేక అవంతరాలు సృష్టించారని కొత్త ప్రభుత్వంలో అలా కాకుండా నిర్మాణాత్మక చర్చ జరగాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు అసెంబ్లీ అంటే కేవలం కేసీఆర్ అన్నట్లుగా కాకుండా ఇప్పుడు ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా చర్చ సాగుతుండటం ఆసక్తిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story