నకిలీ పట్టాల కేసులో కదులుతున్న డొంక

by Sathputhe Rajesh |
నకిలీ పట్టాల కేసులో కదులుతున్న డొంక
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలంగా సాగుతున్న ఫేక్ పట్టాల తయారీ వాటితో డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్, లిటిగేషన్ భూముల పంచాయతీ వ్యవహారం కొలిక్కి వస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న కోట్ల రూపాయల భూదందా వెనుక పెద్దల హస్తం ఉందని పోలీసులు రాసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఫేక్ పట్టాలు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాల వ్యవహారం‌పై పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఫేక్ పట్టాల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. నిజామాబాద్ నగరంలోని కొత్త కలెక్టరేట్ వద్ద బైపాస్ రోడ్‌లో వివాదాస్పద వారసులు లేని ఏడు ఎకరాల భూమిని డాక్యుమెంటేషన్ తయారుచేసి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం ఇటీవల బట్టబయలైన విషయం తెలిసిందే. నలుగురు పోలీసు అధికారులు బినామీలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భూమి విలువ కోట్లలో ఉండగా ఆ సమయంలో పంపకాల విభేదాలతో ఈ వ్యవహారం గుట్టు రట్టు అయిన విషయం విధితమే.

గతవారం సీతారాంనగర్ కాలనీకి చెందిన శేఖర్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు ఫేక్ పట్టాల వ్యవహారంలో నాగారంనకు చెందిన అమర్ సింగ్, గాయత్రి నగర్‌కు చెందిన సుదర్శన్‌లను అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరు భూంరెడ్డి, నాగారం దేవేందర్ పరారీలో ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఫేక్ పట్టాల తయారీ, క్రయవిక్రయాల వ్యవహారంలో సహకరించిన వారి పేర్లను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో అప్పటి నిజామాబాద్ దక్షిణ మండలంలో డీటీగా పనిచేసిన ఆనంద్, అప్పటి సర్వేయర్ స్వప్న, నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్టార్లు వాసుకి, సురేష్, సతీష్‌లతో పాటు మున్సిపల్‌కు చెందిన నరేందర్(నరేష్) పేరు కూడా అందులో పేర్కొన్నారు.

దుబ్బకు చెందిన బంటు గణేష్‌పైన 12 వరకు డాక్యుమెంటేషన్లు ఉండడంతో ఆయనతో పాటు అందులో ప్రమేయం ఉన్న ఒక జాతీయ పార్టీ నాయకుడు రత్నాకర్ పేరును కూడా అందులో చేర్చారు. పక్కా ఆధారాలతో వీరందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన భూ కుంభకోణంలో, లిటిగేషన్ భూముల వ్యవహారంలో ఒక ప్రజా ప్రతినిధి తమ్ముడి పాత్రను సైతం పోలీసులు ఉన్నతాధికారులకు తెలిపినట్టు తెలిసింది. కానీ సదరు ప్రజా ప్రతినిధి సోదరుడి పేరు మాత్రం రిమాండ్ రిపోర్టులో పేర్కొనకపోవడం గమనార్హం. ప్రజా ప్రతినిధి సోదరుడు బినామీగా ఇద్దరు లీడర్లతో జరిపిన దందా వ్యవహారం బహిర్గతం కాకపోవడానికి అధికార పార్టీ లీడర్ల ఒత్తిడి కారణమని తెలిసింది.

Advertisement

Next Story