HYD: మతం మారిన తల్లి.. అంత్యక్రియల విషయంలో కూతురు, కొడుకుల మధ్య గొడవ

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-25 05:48:31.0  )
HYD: మతం మారిన తల్లి.. అంత్యక్రియల విషయంలో కూతురు, కొడుకుల మధ్య గొడవ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మతం మారిన మహిళ అంత్యక్రియల నిర్వహణ పిల్లల మధ్య గొడవకు దారితీసింది. ఈ సంఘటన చాదర్ ఘాట్ లో చోటుచేసుకుంది. ఇస్లాం పద్ధతి ప్రకారమే చేద్దాం.. అలాఎలా? అన్నీ హిందూ సంప్రదాయం ప్రకారం జరిగి తీరాల్సిందే..ఇటీవల మతం మారిన సంతానం మధ్య జరిగిన వాదన ఇది. ఎవరికి వారు పట్టుపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసుల జోక్యంతో విషయం సద్దుమణిగింది.

హైదరాబాద్‌, చాదర్‌ఘాట్‌ ప్రాంతంలోని కమలానగర్‌లో నివాసముండే జీహెచ్‌ఎంసీ రిటైర్డ్‌ ఉద్యోగి రాములమ్మ(82)కు కుమార్తె గుండమ్మ, నలుగురు కొడుకులు ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకుని ఇస్లాం మతం స్వీకరించిన గుండమ్మ సఫీయా బేగంగా పేరు మార్చుకుని మాదన్నపేటలో జీవనం సాగిస్తుంది. చాదర్‌ఘాట్‌లో కొడుకులతో కలిసి ఉండే రాములమ్మ కొద్ది నెలల నుంచి కూతురు ఇంట్లోనే ఉంటుంది.

ఈ క్రమంలో గత జనవరిలో ఇస్లాం మతం స్వీకరించి నవాజ్‌ బేగంగా పేరు మార్చుకుంది. అయితే, అనారోగ్యం వల్ల రాములమ్మ కూతురి ఇంట్లో మంగళవారం మరణించింది. విషయం తెలుసుకున్న రాములమ్మ కుమారులు,ఇతర కుటుంబసభ్యులు మాదన్నపేటలోని గుండమ్మ అలియాస్‌ సఫీయా ఇంటికి తరలివచ్చారు. అయితే, ముస్లిం ఆచారాల ప్రకారం రాములమ్మను ఖననం చేస్తామని గుండమ్మ తెలిపింది.

లేదు హిందూ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు చేస్తామని రాములమ్మ కొడుకులు పట్టుబట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారి మధ్య రాజీ కుదిర్చారు. తొలుత ఇస్లాం మతం ప్రకారం ప్రార్థనలు చేసిన అనంతరం రాములమ్మ మృతదేహాన్ని హిందూ శ్మశానవాటికకు తరలించి దహనసంస్కారాలు చేపట్టడంతో వివాదం సద్దు మనిగింది.

Advertisement

Next Story

Most Viewed