- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు జిల్లాల్లో అధిక ఎండలు.. తెలంగాణ వెదర్ రిపోర్టు హెచ్చరిక
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ తెలంగాణలో ఈ ఏడాది 8 నుంచి 9 నెలల పాటు కరువు ప్రభావం ఉంటుందని రాష్ట్ర వడగాల్పుల ప్రణాళిక (హీట్‌వేవ్ రిపోర్ట్) నివేదిక స్పష్టం చేసింది. వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు నెలల మినహాయిస్తే.. మిగిలిన కాలంలో పొడి వాతావరణంతో నీటి కష్టాలు ఉంటాయని, ఇది వ్యవసాయంపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగతాయని, ఈ ఏడాది మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దీంతో వడదెబ్బ మరణాలు పెరిగే ఛాన్స్ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో 589 మండలాలుంటే 568 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 49 సెంటీగ్రేడ్‌లు నమోదయ్యే ఛాన్స్75 శాతం ఉందని, 47 డిగ్రీల వరకు వడగాల్పులువీచే అవకాశం 100 శాతం ఉందని నివేదికల్లో సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్అథారిటీ, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ప్లానింగ్ సొసైటీ, యూనిసెఫ్, తెలంగాణ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశాయి.
ఈ ఐదు జిల్లాల్లో కరువు
దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలతో సహా మొత్తం ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో ఈ ఏడాది కరువు ఉంటుందని, ఎక్సెస్ వర్షపాతం నమోదైనా కరువు ప్రభావం ఉంటుందని వెల్లడించారు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్జిల్లాల్లో కరువు ఉంటుందని వివరించారు. 76 మండలాల్లో పూర్తి అత్యధికంగా ఈ పరిస్థితులు ఉండగా.. 98 మండలాల్లో అత్యధికంగా, 91 మండలాల్లో మధ్యస్థంగా, 90 మండలాల్లో కొంత మేరకు, 87 మండలాల్లో పాక్షికంగా కరువు ప్రభావం ఉంటుందని నివేదికల్లో సూచించారు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోనున్నట్లు హెచ్చరించారు. వానాకాలంలో 4 నెలల పాటు వర్షపాతం ఉన్నా.. ఇప్పుడు పొడి వాతావరణం, వేడి ప్రభావంతో జలాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా వ్యవసాయ పంటలకు చాలా ప్రమాదమని వెల్లడించారు.
వడదెబ్బ ఎక్కువవుతోంది
రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మే నెలలో 47 నుంచి 49 డిగ్రీలకు చేరుతుందని హీట్‌వేవ్ రిపోర్టులో హెచ్చరించారు. ఖమ్మం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ మరణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత కొంత కాలాన్ని పరిశీలిస్తే 2015లో ఎక్కువ వడదెబ్బ మరణాలు సంభవించాయని, ఈసారి దాటే ప్రమాదమున్నట్లు హెచ్చరించారు. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో మరణించారని, ఆ తర్వాత 2013లో 516 మంది, 2016లో 324 మంది, 2017లో 108 మంది, 2018లో 12 మంది, 2019లో 64 మంది, 2020లో 9 మంది మరణించగా… ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు సూచించారు.
ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
తీవ్ర వేడిగాలులతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం కొన్ని జిల్లాలకు ఉందని వడగాల్పుల నివేదికలో వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఇక ఎండాకాలంలో సీజన్‌లో అంగన్వాడీ కేంద్రాలపై జాగ్రత్తలు అవసరమని, పిల్లలు, గర్భిణీ స్త్రీలపై వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మొత్తం 31,897 అంగన్వాడీ కేంద్రాలు, 4076 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మీట్వేవ్స్ ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఇక కోవిడ్ కారణంగా గత ఏడాది వడగాల్పుల ప్రమాదం గుర్తించలేకపోయామని, కానీ ఈసారి కోవిడ్‌తో పాటు వడగాల్పులు కూడా తోడవుతుండటంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తీవ్రంగా ఎండలు ఉండే ఏప్రిల్చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు 40 రోజుల వరకు పనులను తగ్గించుకోవాలని, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఒబేసిటీ బాధితులు బయటి పనులకూ దూరంగా ఉండటమే శ్రేయస్కారమంటూ సూచించారు.
ఈసారి 21 నుంచి 40 రోజుల వరకు వేడిగాలులు
ఈ ఏడాది మొత్తం 21 నుంచి 40 రోజుల వరకు అత్యధిక వేడితో కూడి గాలులు వీస్తాయని హీట్‌వేవ్ రిపోర్టులో సూచించారు. కారణాలేమైనా గతంలో కంటే ఈసారి పెరుగతుందని సూచించారు. అదే విధంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, గత ఏడాది అత్యధికంగా మే 24న జగిత్యాల మండలం వెల్గటూరు మండలం ఎండపల్లిలో 47.2 డిగ్రీలు నమోదైందని వెల్లడించారు. కానీ ఈసారి మాత్రం చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీలు దాటే ప్రమాదమున్నట్లు సూచించారు.
కమిటీని పుననిర్మాణం చేయాల్సిందే
వడగాల్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం కమిటీని పుననిర్మాణం చేయాలని హీట్‌వేవ్ రిపోర్టులో ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో కమిటీ కొనసాగుతుందని, దీనికి అత్యవసర నిధులు కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ సెక్రెటరీ కన్వీనర్‌గా పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుసంవర్థశాఖ కార్యదర్శులు, పబ్లిక్ హెల్త్, ఐపీఎం డైరెక్టర్లు, ఫైర్, మెట్రోపాలజీ డైరెక్టర్లు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలతో కమిటీ ఉండాల్సిందేనని వెల్లడించారు.వడదెబ్బ మరణాలను నివారించేందుకు ఈ కమిటీ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
ప్రచారం కూడా ముఖ్యమే..
వడగాలులతో ప్రమాదాలు, జరుగుతున్న పరిణామాలను సూచించిన జిల్లాల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై షార్ట్ ఫిలీంతో కూడా ప్రచారం చేయాలని, ఉపాధి పనులను తగ్గించాలని రిపోర్టులో సూచించారు. ఉపాధి కూలీలకు ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి వసతులు, వైద్య బృందాలు అందుబాటులో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలను నివేదికలో సమగ్రంగా వివరించారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో ఎల్‌ఈడీ ద్వారా డిసిప్లే చేయించాలని, మూడు రోజుల వెదర్ రిపోర్టును విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్లూయిడ్స్ఏర్పాటుతో పాటుగా ఓఆర్ఎస్ప్యాకెట్లను ప్రత్యేకంగా అందుబాటులో పెట్టాలని, బెడ్స్అదనంగా ఏర్పాటుచేయాల్సిందిగా వెల్లడించారు. విడుతల వారీగా స్టాఫ్‌ను విధుల్లో ఉంచాలని, పీహెచ్‌సీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య బృందం ఉండాల్సిందేనన్నారు.
పశువులు జాగ్రత్త
రాష్ట్రంలో వేడిగాలులతో ఈసారి పశు సంపదకు ప్రమాదముందని హెచ్చరించారు. పశువుల కోసం తాగునీటిని గ్రామాల పరిసరాల్లో ఏర్పాట్లు చేయాలని, వడగాల్పులు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రత్యేక నిధులతో చర్యలు తీసుకోవాల్సింగా సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అస్పత్రుల్లో పశు వైద్యులు ఉండాలని, గ్రామాల్లో కూడా గోపాలమిత్రల దగ్గర వేడిని తగ్గించే మందులు అందుబాటులో పెట్టాలని వెల్లడించారు.
అమలు చేయాల్సింది ఇవే
గ్రామస్థాయి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రణాళిక అమలుపై నివేదికల్లో సమగ్రంగా వివరించారు. ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్ ఈ ఎండాకాలం మొత్తం ఉండాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, గ్రేటర్హైదరాబాద్లో నోడల్ అధికారులను నియమించాలన్నారు. ముందు నుంచే శిక్షణా కార్యక్రమలు ఉండాలని, వైద్యారోగ్య శాఖ, కమ్యూనిటీ హెల్త్ స్టాఫ్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, ఆశా, ఏఎన్ఎంలులకు హీట్వేవ్యాక్షన్ ప్లాన్వివరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక వడగాలులు, సన్‌స్ట్రోక్‌తో చనిపోతే అపద్భందు కింద వెంటనే రూ. 50 వేల పరిహారం అందించాలన్నారు. వడగాలులతో మృతుల వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించాలంటూ ఫార్మాట్‌ను వడగాలుల నివేదికలో సూచించారు.