- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరచేతిలో ప్రజల ఆరోగ్యం.. తెలంగాణలో కొత్త టెక్నాలజీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి ప్రజల ఆరోగ్య పరిస్థితి అరచేతిలోనే తెలియనుంది. టెక్నాలజీని వినియోగించుకొని పబ్లిక్ హెల్త్ కండీషన్‌ను డిజిటల్ రూపంలో పొందుపరచనున్నారు. ఈ మేరకు రాష్ర్టంలోని ప్రతి వ్యక్తి హెల్త్ పరిస్థితిపై సర్కార్ ఆరా తీయనుంది. ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనుంది. తర్వాత పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేకమైన కార్డును రూపొందించనుంది. ఈ ప్రోఫైల్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసి, ప్రతి వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖలోని ఓ కీలక అధికారి తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఈ వివరాలను లింక్ రూపంలో అనుసంధానం చేయనున్నారు. దీంతో సదరు వ్యక్తి రాష్ర్టంలోని ఏదేని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఆన్‌లైన్‌లోని రికార్డుల ప్రకారం చికిత్స నిర్వహించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐటీ విభాగం సహాయాన్ని తీసుకోనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఐహెచ్ఐపీ(ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం)కు కూడా దీన్ని అనుసంధానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చె నెలలో షురూ..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హెల్త్ ప్రొఫైల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు వచ్చె నెలలో షురూ కానుంది. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. రెండు విభాగాలుగా మూడు నెలల పాటు ఈ ప్రాజెక్టు వర్క్ జరగనుంది. ఆయా జిల్లాల్లో ఈ కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడీల పర్యవేక్షణలో జరగనుంది. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయి పరిశీలన తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేయనుంది.
ఫస్ట్ రౌండ్‌లో ఇంటి వద్ద 10 రకాల టెస్టులు..
హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ఫస్ట్ రౌండ్‌లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది నేరుగా ఇంటి వద్ద పది రకాల పరీక్షలను నిర్వహించనున్నారు. బీపీ, షుగర్, రక్తంలో హిమోగ్లోబిన్, బరువు, ఎత్తు, ప్రాథమిక కంటి, పంటి పరీక్షలు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు పరిశీలన, ఆక్సిజన్, శ్వాస రేటు, జ్వర పరీక్షలను నిర్వహించనున్నారు. అంతేగాక ప్రతి రోజూ పౌష్ఠికాహారం ఏ మేరకు తీసుకుంటున్నారు? అనే అంశాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ పరీక్షల అనంతరం హైరిస్క్ గ్రూప్‌నకు చెందిన వ్యక్తులను గుర్తించనున్నారు. తర్వాత వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 37 వేల ఆశా వర్కర్లకు, 8 వేల ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
సెకండ్ రౌండ్‌లో చేసే పరీక్షలు ఇవే..
రక్తంలోని హిమోగ్లోబిన్, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్ కౌంట్, గ్లూకోజ్ శాతం, కొలెస్ర్టాల్, కిడ్నీ, లివర్, గుండె అంతర్గత పనితీరు టెస్టులు, హార్ట్ రేట్, ఈసీజీ, ఆక్సిజన్ సాచ్యురైజేషన్, రెటీనా ఎవల్యూషన్, చెవుల పనితీరు, చర్మం నాణ్యత తెలుసుకునేందుకు స్కిన్ పరీక్షలు, డెంటల్, చిగుర్ల పరిస్థితి కొరకు ప్రత్యేకమైన డిజిటల్ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నీటి కొరకు యంత్రాలను కూడా కొనుగోలు చేయనున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ వైద్యాధికారి దిశకు తెలిపారు.
ఎక్కడి నుంచైనా..
ఆన్ లైన్‌లో ఎంట్రీ చేసిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టంలోని ఏదేని ప్రభుత్వాసుపత్రుల్లో ఉండే వైద్యులతో చెక్ చేయించుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా డాక్టర్లు పేషెంట్ గత చరిత్రను పూర్తిగా పరిశీలించవచ్చు. దీంతో డాక్టర్‌కు సమయం కలిసిరావడమే కాకుండా బాధితులకు సత్వరమే చికిత్స లభించే అవకాశం ఉన్నది. జిల్లాలకు చెందిన పేషెంట్లు హైదరాబాద్ కు వచ్చి ఎలాంటి రిపోర్టులు లేకుండానే ఆన్ లైన్ వివరాల ద్వారా చికిత్స పొందవచ్చని హెల్త్ డిపార్ట్‌మెంట్ చెబుతున్నది. ఆధార్ నంబర్ ను హెల్త్ ప్రొఫైల్ లింక్ లో ఎంట్రీ చేస్తే సదరు పేషెంట్ కు గతంలో నిర్వహించిన నిర్ధారణ పరీక్షలు, ఇచ్చిన మందులు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వంటి తదితర వివరాలు ఉంటాయి. వాటి ప్రకారం ఆ బాధితుడికి తర్వాత చికిత్సను నిర్వహిస్తారు.
పేషెంట్లకూ ఎంతో ఉపయోగకరం..
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కలుపుతూ, పేషెంట్ల వివరాలను హెల్త్ ప్రోఫైల్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావటం వలన పేషెంట్ కూ ఎంతో ఉపయోగమని అధికారులు చెబుతున్నారు. సత్వరమే వైద్యం అందడమే కాకుండా ఒకటికి రెండు సార్లు నిర్ధారణ పరీక్షలు చేయించుకునే బాధ తప్పనుంది. అంతేగాక గతంలో వినియోగించిన మందుల వివరాలు వైద్యులకు తెలియడం వలన, శరీర పరిస్థితిని బట్టి డోసులు కేటాయించే అవకాశం ఉన్నది. దీని వలన మందులతో మల్టీ ఆర్గాన్స్ పై ప్రభావం తగ్గనుంది. మరోవైపు అత్యవసర సమయాల్లో పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకొని వేగంగా వైద్యం అందించవచ్చు.