Disha Special: ఈ బైక్‌ కిందపడదు! మీకు డ్రైవింగ్ రాకున్నా హ్యాపీగా దూసుకుపోవచ్చు!!

by Bhoopathi Nagaiah |
Disha Special: ఈ బైక్‌ కిందపడదు! మీకు డ్రైవింగ్ రాకున్నా హ్యాపీగా దూసుకుపోవచ్చు!!
X

న్నోసార్లు కిందపడితేనే తప్ప సైకిల్ (cycle) నేర్చుకోలేము. కానీ, సైకిల్ కూడా నేర్చుకోకుండానే డైరెక్టుగా బైక్ (Bike) నడిపేయొచ్చు. మరి బ్యాలెన్స్ ఎలా చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? టెక్నాలజీ అంటే అదే మరి. ఇప్పటివరకు మనం ఎన్నో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (Electric Vehicles)చూసి ఉంటాం. ఇప్పుడు వాటిని అప్ డేట్ వర్షన్ రాబోతున్నది.. అదే బ్యాలెన్స్ బైక్ (Balance bike). అంటే కిందపడటం తెలియని బైక్. నమ్మలేకపోతున్నారా? ఇది నిజంగా నిజం. జైరోస్కోప్ (Gyroscope) అనే టెక్నాలజీతో ఇది సాధ్యమే. ఇప్పుడు అభివృద్ధి దశలో ఉన్న ఈ టెక్నాలజీ కొన్నేళ్లలో అందరికీ అందుబాటులోకి రానున్నది. అమెరికాలో లిట్ అనే కంపెనీ ఈ పనిలో నిమగ్నమై ఉండగా.. భారత్ లో లైగర్ (Liger bike) పేరిట ఓ కంపెనీ తయారు చేస్తున్నది. అసలు ఈ బైక్ ఎందుకు కిందపడదు? దీని టెక్నాలజీ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పటికే దీనిని ఎందులోనైనా వినియోగిస్తున్నారా? అన్న సాంకేతిక అంశాలతోపాటు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.. - హరీశ్ ఎస్పీ

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్స్ (Self-balancing bikes) అనేవి సాధారణ సైకిళ్లు లేదా మోటార్‌సైకిళ్లను నడిపేవాళ్ల బ్యాలెన్స్ పై ఆధారపడకుండా ఉంటాయి. వాటంతట అవే వాహనాన్ని కిందపడకుండా బ్యాలెన్స్ చేస్తాయి. వాహనం ఆన్ అయి ఉన్నప్పుడు కనీసం స్టాండ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కాలు కింద పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఙానం అవసరం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నతస్థాయి టెక్నాలజీ కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అదేకోవలోకి బ్యాలెన్సింగ్ బైక్ కూడా చేరబోతున్నది. మనదేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడే జరుగుతున్నాయి. ప్రధానంగా బైక్ కిందపడటం వల్లనే వీటిలో ఎక్కువగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నివారించేందుకు అవకాశం ఉన్నది.

1. సెన్సార్లు, జైరోస్కోప్‌లు

అన్ని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వాహనాలు.. జైరోస్కోప్‌ లేదా యాక్సిలరోమీటర్లను ఉపయోగిస్తాయి. ఈ సెన్సార్లు బైక్ యొక్క వంపు (tilt) మరియు కదలికను నిరంతరం గుర్తిస్తాయి.

జైరోస్కోప్ అనేది ఒక స్పిన్నింగ్ వీల్ (Spinning wheel) లేదా డిస్క్ (Disc) అని అనుకోవచ్చు.. దీని యాక్సిస్ ఎప్పుడూ స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇది బైక్ వంగినప్పుడు దాన్ని స్థిరీకరించడానికి యాంగులర్ మొమెంటం ఉపయోగపడుతుంది. అంటే బైక్ కిందపడుతుందన్న సమయంలో దానికి అంతకుమించి కిందకు పడకుండా జైరోస్కోప్ ఒక ఫోర్స్‌లా దానిని కాపాడుతుంది. హార్లీ డేవిడ్‌సన్ (Harley Davidson) కంపెనీ కొన్ని బైకుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నది.

2. స్టీరింగ్ మరియు ఫ్రంట్ ఫోర్క్ అడ్జస్ట్‌మెంట్

బైకులు కిందపడకుండా ఉండేందుకు జైరోస్కోప్ తోపాటు స్టీరింగ్ (Steering) మరియు ఫ్రంట్ ఫోర్క్ అడ్జస్ట్‌మెంట్ టెక్నాలజీ (Front fork adjustment technology) కూడా ఉపకరిస్తు్ంది. హోండా రైడింగ్ అసిస్ట్ టెక్నాలజీ వంటివి ఫ్రంట్ ఫోర్క్ (ముందు చక్రాన్ని హ్యాండిల్‌బార్‌తో కలిపే భాగం) యొక్క కోణాన్ని సర్దుబాటు చేస్తాయి. అయితే తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు అంటే గంటకు 3మైళ్ల స్పీడ్ లో మాత్రమే బైక్ కిందపడకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఫ్రంట్ వీల్‌ను స్టీర్-బై-వైర్ సిస్టమ్ (Steer-by-wire system) ద్వారా స్వయంగా కదిలిస్తుంది.. ఆ సమయంలో బైక్ పడిపోకుండా కాపాడుతుంది. మామూలు బైకులు అనుకోండి.. బైక్ కిందపడుతున్నప్పుడు ముందటి వీల్ కిందికి వంగుతుంది.. కానీ, ఈ టెక్నాలజీలో బైక్ కిందపడుతున్నప్పుడు ముందు ఉన్న వీల్ వాహనాన్ని స్థిరంగా ఉంచేందుకు వ్యతిరేకదిశలో ఫోర్స్ పెంచుతుంది.

3. ఎలక్ట్రిక్ మోటార్లు

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్స్ ఎక్కువ ఎలక్ట్రిక్ మోటార్ల(Electric motors)తో పనిచేస్తాయి. ఇవి జైరోస్కోప్‌లను తిప్పడానికి లేదా స్టీరింగ్ సర్దుబాట్లు చేయడానికి శక్తిని అందిస్తాయి. ఉదాహరణకు, లిట్ మోటార్స్ యొక్క ఆటో-బ్యాలెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (AEV) రెండు జైరోస్కోప్‌లను ఉపయోగిస్తుంది, ఇవి 100 mph వేగంతో కూడా బైక్‌ను నిలబెట్టగలవు.

ఎలా పనిచేస్తాయి?

బైక్ వంగినప్పుడు.. సెన్సార్లు దాని టిల్ట్ యాంగిల్‌ను గుర్తిస్తాయి. కంట్రోల్ సిస్టమ్ ఈ సమాచారాన్ని ఉపయోగించి, జైరోస్కోప్‌ను తిప్పడం లేదా ఫ్రంట్ వీల్‌ను సర్దుబాటు చేయడం ద్వారా బైక్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. తక్కువ వేగంలో లేదా ఆగినప్పుడు, ఈ సిస్టమ్ బైక్ పడిపోకుండా చూస్తుంది, ఇది సాధారణ బైకుల్లో చాలా కష్టం. ఉదాహరణకు.. హోండా బైక్ తన యజమానిని అనుసరించగలదు, దీనికి స్టీరింగ్ మోటార్ మరియు సెన్సార్లు సహాయపడతాయి.

ఎవరికి ఉపయోగం: కొత్త రైడర్లకు లేదా భారీ బైక్‌లను నడపడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపకరిస్తుంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు కాలు కింద పెట్టాల్సిన అవసరం లేదు. పైగా శారీరక లోపాలున్న వారు కూడా రైడ్ చేయవచ్చు.

బైకులు.. వేగ పరిమితి

లిట్ మోటార్స్ సీ1 (Lit Motors C1): ఈ బైక్ అమెరికా తయారీ. దీని ధర దాదాపు కోటిపైనే ఉన్నది. ఇది 160కిలోమీటర్ల వేగంతో వెళ్లినా కిందపడదు. బైకుకు రెండు వైపులా జైరోస్కోప్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనిని ఆన్ చేసి ఎక్సిలరేటర్ ఇచ్చి వదిలేస్తే చార్జింగ్ అయిపోయేంత వరకు బండి ఆగదు.. కిందకూడా పడదు.

లైగర్ ఎక్స్ (Liger X): ఇది ఇండియా బేస్ మోడల్. దీని గరిష్ట వేగం 65కిలోమీటర్లు. ఆ వేగంతో వెళ్లినా కూడా బండి కిందపడదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది.

ఇంకా ఈ తరహా వాహనాల తయారీపై హోండా (Honda), యమహా మోటార్స్ (Yamaha Motors) కూడా పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు లిట్, లైగర్ మోడళ్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి ఒకటి, రెండేళ్లలో అందుబాటులోకి రావొచ్చు. కానీ, 5నుంచి 10ఏళ్లలో మార్కెట్ మొత్తం వీటిదే అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలా? వద్దా? అని ఆలోచిస్తున్న మనం.. తొందరలోనే జైరోస్కోప్ టెక్నాలజీ బైకులను వాడేందుకు ఉత్సాహం చూపిస్తాం. అయితే, ఇలాంటి వాహనాలు మార్కెట్‌లోకి రావడానికి ఇప్పుడున్న చట్టాలు సహకరించవు. వాటిని సవరించడమో లేక కొత్త చట్టాలు తేవడమో జరగాలి.

జైరోస్కోప్ టెక్నాలజీ (Gyroscope technology)కొత్తదా?

వాస్తవానికి ఈ టెక్నాలజీ కొత్తది కాదు.. చాలా పాతది. ఇప్పటికే ఇది ఎంతో సక్సెస్ అయిన మోడల్. కానీ, దీనిని విమానాల్లో అది కూడా ఫైటర్ జెట్ల (Fighter jets)లో వినియోగిస్తున్నారు. ఒకప్పటి విమానాలు పల్టీలు కొడితే కంట్రోల్ తప్పి నేలకూలేవి. కానీ, ఇప్పుడు ఎంత వంపు తిరిగినా.. ఎన్ని పల్టీలు కొట్టినా ఫైటర్ జెట్లు స్థిరత్వం కోల్పోవు. దానికి జైరోస్కోప్ టెక్నాలజీయే ప్రధాన కారణం. జైరోస్కోప్‌లు విమానాల ఓరియంటేషన్ (దిశ మరియు వంపు) గుర్తించడానికి, నావిగేషన్‌కు, మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి. జైరోస్కోప్ అడ్వాన్స్ వర్షన్ వల్లనే విమానాల్లో ఆటో పైలట్ ఆప్షన్ వచ్చింది. విమానం తనంతటతానే నడిపేందుకు ఈ టెక్నాలజీ సాయపడుతుంది. ఆటోపైలట్ మోడ్ లో విమానం నడుస్తున్నప్పుడు తనకు ఏదైనా అవరోధాలు ఎదురైతే ముందుగానే అలర్ట్ బీప్ ఇవ్వడంతోపాటు ఆ అవరోధం ఏంటనే విషయాన్ని కూడా చెప్తుంది. ఈ టెక్నాలజీ బోయింగ్ 737, ఎయిర్ బస్ ఏ320వంటి విమానాల్లో ఉన్నది. విమానం ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని రియల్ టైమ్ లో కూడా ఈ టెక్నాలజీయే చెప్తుంది.

మొత్తానికి అతి సమీప భవిష్యత్తులో జైరోస్కోప్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది ద్విచక్ర వాహనాలను మరింత ఆధునీకరిస్తాయని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వికలాంగులు, కొత్తగా బైక్ నడిపేవారు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. రోడ్డు భద్రత ప్రమాణాలు కూడా మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో లెట్ అజ్ వెయిట్ ఫర్ న్యూ బైక్స్.



Next Story

Most Viewed