తెలంగాణలో ఫిట్‎మెంట్ 29 శాతం..?

by Shyam |
తెలంగాణలో ఫిట్‎మెంట్ 29 శాతం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేతన సవరణ అంశంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఐఆర్ కంటే కొంత మెరుగ్గానే ఫిట్ మెంట్ ఇవ్వాలని భావిస్తోంది. దీని కోసం ఆర్థిక శాఖ లెక్కలేసింది. దీనిపై త్రిసభ్య కమిటీతో భేటీ అయిన సీఎం.. ఫిట్​మెంట్ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఏపీ ఇస్తున్న ఐఆర్, త్వరలో ఇచ్చే పీఆర్సీతో పాటుగా ఎంత మేరకు పెరుగుతుందనే అంశాలన్నీ సమగ్రంగా పరిశీలించారు.

దీంతో ఏపీ కంటే కొంత ఎక్కువగా ఫిట్​మెంట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం 29 శాతం ఫిట్​మెంట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఏపీ ఇప్పటికే 27 శాతం ఐఆర్​ను అమలు చేస్తోంది. ఒకవేళ పీఆర్సీ ఖరారు చేస్తే కచ్చితంగా అక్కడి కంటే ఒకటో, రెండు శాతమో అదనంగా ఇవ్వనున్నారు. అంతకు మించి ఇస్తే కష్టమని ఆర్థిక శాఖ తేల్చింది. ఈ ప్రకారం కూడా సుమారు రూ. 6 వేల కోట్లు అదనపు భారం పడనున్నట్లు అంచనా వేశారు.

15లోపే ప్రకటన?

2018 జూన్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఏప్రిల్ నుంచి పీఆర్సీ వర్తింపచేస్తే.. ఉద్యోగులు దాదాపు రెండున్నరేండ్ల కాలాన్ని నష్టపోతారు. అయినా 35 శాతం ఫిట్​మెంట్ ఇస్తే కొంత బెటర్​ అని మరో ప్రతిపాదన కూడా ఉంది. కానీ అయితే ఉద్యోగ సంఘాలను ఒప్పించి 29 శాతం ఫిట్​మెంట్ ప్రకటించి, ఏప్రిల్​ నుంచి వర్తింప చేసేందుకు చర్చించాలని భావిస్తున్నారు. ఈ నెల 15లోగా గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, దీనిలో భాగంగా రెండు రోజుల ముందే ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ నెల 12 వరకు ప్రకటిస్తారని ఆశల్లో ఉండగా… మరికొన్ని సంఘాలు మాత్రం దాట వేస్తారనే చెప్పుతున్నాయి.

ఉద్యోగ సంఘాల ఆగ్రహం

తాజా పరిణామాలు ఉద్యోగ సంఘాల్లో అగ్గి పుట్టిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలను వేరు చేస్తారని, వేర్వేరు ఫిట్​మెంట్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కడా క్లారిటీ రాకున్నా… ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో మాత్రం ఆగ్రహం వస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగ సంఘాల జేఏసీతో సంబంధం లేకుండా విడదీశారు. అప్పుడు జేఏసీని చేరదీసిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ జేఏసీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. ఆర్టీసీ జేఏసీ.. తమకు సహకరించాలని కోరినా జేఏసీ వెనకడుగు వేసింది. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed