- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితం ఆ రోజే..!
దిశ, తెలంగాణ బ్యూరో /నల్లగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల తతంగం ఆసాంతం ఉత్కంఠగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీతో పాటు భారీగా పెరిగిన స్వతంత్రులతో పోటీ రసవత్తరంగా సాగింది. నేటి నుంచి ఓట్లు లెక్కింపును ప్రారంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ విజేత ఎవరో తేలడానికి గరిష్ఠంగా ఐదు రోజులు పట్టే అవకాశాలున్నాయి. హైదరాబాద్ స్థానం పోలింగ్ ఓట్లను సరూర్ నగర్ స్టేడియంలోనూ, నల్లగొండ స్థానంలో ఓట్ల లెక్కింపును జిల్లాలోని అర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో చేపట్టనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 67.26 శాతం పోలింగ్ నమోదయింది. నల్లగొండ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. పోలింగ్ 76.41 శాతం నమోదయింది. భారీగా ఉన్న అభ్యర్థుల్లో రాజకీయపరంగా ముగ్గురి కంటే ఎక్కువ మంది మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఈ సారి ముందస్తుగా విజేతలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.
లెక్కింపు కత్తిమీద సాము
జంబో బ్యాలెట్ బాక్స్‌లు, జంబో బ్యాలెట్ పత్రాలను లెక్కించడం ఎన్నికల అధికారులకు కత్తి మీద సాముగానే కనిపిస్తోంది. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో 5,31,268 మంది ఓటర్లు నమోదు చేసుకొని ఉండగా.. 3,57,354 (67.26%) మంది ఓట్లేశారు. తొమ్మిది జిల్లాల్లో 799 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అన్ని జిల్లాల ఓట్లను ఒకే చోట లెక్కించనున్నారు. ఇక నల్లగొండ పట్టభద్రుల స్థానంలో 12 జిల్లాల్లో 731 పోలింగ్ కేంద్రాల పరిధిలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, 3,86,320 ఓట్లు పోలయ్యాయి. రెండు స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు 8 హాళ్లలో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ ఇలా..
ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్ పత్రాలను ఉంచిన అనంతరం 25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కడతారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం 25 చొప్పున బ్యాలెట్ పత్రాను ఒక కట్ట కట్టడానికే అధిక సమయం పట్టేఅవకాశం ఉంది. అనంతరం కట్ట కట్టిన బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్‌ల సమక్షంలో వేరు చేస్తారు. అప్పుడు మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. పోలైన అన్ని ఓట్లను లెక్కించేందుకు సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. టేబుల్‌కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. 3,57,354 ఓట్లను లెక్కించడానికి దాదాపు పది గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. రౌండ్ల వారీగా అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను పోటీలో నుంచి తొలగిస్తూ ఆ ఓట్లను మిగిలిన అభ్యర్థులు పంచుతూ కౌంటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఈ ప్రత్యేక విధానం ప్రకారం నల్లగొండ స్థానంలో మొదటి అభ్యర్థిని పోటీలో తొలగించడం గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే అవకాశముండగా… హైదరాబాద్ స్థానంలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మూడో రోజు నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల అధికారి తెలిపిన వివరాల ప్రకారం .. నల్లగొండలో 18 ఉదయం నుంచి అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రారంభమై.. 19న తుది ఫలితం వెలువడుతుంది. హైదరాబాద్‌లో తొలి అభ్యర్థి ఎలిమినేషన్ ఈ నెల 19న ప్రకటించే అవకాశం ఉండగా… ఎన్నికల్లో విజేత ఎవరో ఈ నెల 21న తేలనుంది. ఈ నెల 22తో ఎన్నికల కోడ్ ముగియనున్నట్టు ముందుగానే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అంతా షెడ్యూల్ ప్రకారమే జరగనున్నట్టు వివరించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అభ్యర్థులు, పోలైన ఓట్ల సంఖ్య, కౌంటింగ్ టేబుళ్లు, విధానం ఒకే రకంగా ఉన్నాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందికి కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు.
806 మంది సిబ్బంది… మూడు విడతల్లో విధులు
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు కోసం 806 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లను లెక్కించేందుకు 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్‌కు ఒక ఆర్‌ఓ, ఇద్దరు ఏఆర్‌ఓలు, ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున నలుగురు ఉంటారు. ఈ లెక్కన 56 టేబుళ్లకు 224 మంది ఓట్లను లెక్కించనున్నారు. మూడు షిప్టుల్లో కలిపి 672 మంది కేవలం ఓట్లను లెక్కించే పనిని చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి అదనంగా 20 శాతం అంటే 134 మందిని కూడా ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం 806 మందికి చేరుకుంటుంది. బ్యాలెట్ పత్రాలను బండిల్స్ చేయడం, డ్రమ్ముల్లో కలపడం, టేబుళ్ల వద్దకు చేర్చడం వంటి పనుల కోసం మరో వంద మందిని నియమించారు. ఎన్నికల పర్యవేక్షణ, విభాగం అధికారులు కలిపితే సుమారు 950 మంది వరకూ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో ఉండనున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి తెలిపారు.
నల్లగొండలో భారీ భద్రత
నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానంలోని 12 జిల్లాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నేటి నుంచి చేపడుతున్న నేపథ్యంలో అర్జాలబావిలో భారీ భద్రతను కల్పించారు. సుమారు ఆరొందల మంది వరకూ ఎన్నికల కౌంటింగ్ చేపడుతుండగా.. అదనంగా మరో రెండొందల మందికి పైగా ఈ ప్రక్రియలో పాల్గొంటుున్నారు. రోజుల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉండడం వల్ల రెండుమూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా భారీ ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు మరో వెయ్యి మంది పోలీసులు విధుల్లో పాల్గొనున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో మద్యం దుకాణాలను సైతం మూసేయించారు.