ముదురుతోన్న జల వివాదం.. ‘రాయలసీమ’ను ఆపాల్సిందే..

by srinivas |   ( Updated:2021-07-05 23:19:40.0  )
rayala-seema
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమైనదని, దానికి నీటి కేటాయింపులు లేవని, ఎలాంటి పర్యావరణ అనుమతులు కూడా లేవని, గతంలో వెలువరించిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు సాగుతున్నాయని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. గతేడాది అక్టోబరు 29న ఎన్జీటీ వెలువరించిన ఉత్తర్వులను బుట్టదాఖలు చేస్తూ ముమ్మరంగా నిర్మాణపు పనులు చేస్తున్నందున వెంటనే ఫిజికల్ ఇన్‌స్పెక్షన్ చేపట్టాలని ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌‌లో కోరింది. ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎస్‌పీఎంఎల్ ఇన్‌ఫ్రా అనే నిర్మాణ సంస్థపైన కూడా చట్టపరమైన చర్యలను తీసుకోవాలని లేఖలో కోరింది.

ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలి..

మరోవైపు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాసి ఈ నెల 9వ తేదీన జరపనున్న త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేసి 20వ తేదీ తర్వాత ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణను నిలువరించేలా ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ అసంబద్దమైనదని, కేంద్ర జల సంఘం మొదలు ప్లానింగ్ కమిషన్ వరకు ఆ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టిందేనని గుర్తుచేశారు. మొత్తం ఆరు అంశాలపైన ఫుల్ బోర్డు మీటింగ్ జరగాలని ఆ లేఖలో బోర్డు ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కుడి కాల్వ పనులను సైతం నిలిపివేయించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన కేటాయింపులకు అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను తరలించుకుపోయే చర్యలను నిలువరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చినందున బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా లభించిన హక్కు ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలు రావాలని, ఇందుకు బోర్డు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు..

ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని, జాతీయ పార్కులు సహా వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అనేక అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారానికి ముప్పు ఏర్పడిందని, వివిధ విశ్లేషణలో వెల్లడైన వివరాలను ఆ లేఖతో పాటు సమర్పించారు. కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వని కారణంగానే కేటాయింపులు చేయడం సాధ్యం కాదనే వివరణను జోడించి పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి ఇదే మంత్రిత్వశాఖ గతంలో నిరాకరించిందని గుర్తుచేశారు.

బేసిన్ పరిధి దాటి కృష్ణా జలాలను తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనికి కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి లేదని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా గుండ్ల బ్రహ్మేశ్వరం, లంక మల్లేశ్వరం, పెనుశిల నర్సింహ, రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు, వెంకటేశ్వర పార్కు తదితరాలకు చెందిన పది కి.మీ. విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాల్లో కాలువలు, నిర్మాణాలు జరుగుతాయని, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నదని వివరించారు. జాతీయ పార్కుల బఫర్ జోన్‌లో నుంచి నిర్మాణాలు ఉంటాయని వివరించారు. గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసిందని వివరించారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీచేసే ముందు ఈ అంశాలను పరిశీలించాలని సూచించారు.

తెలంగాణ ఏజీకి హైకోర్టు అక్షింతలు..

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి విషయంలో జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తిపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ జీవో కారణంగా కృష్ణా డెల్టాలోని రైతులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోవడంపై వాదనలు జరుగుతున్న క్రమంలో తెలంగాణ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుని, ఈ పిటిషన్‌ విచారణ నుంచి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తప్పుకోవాలని కోరారు. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు విచారణ జరగాలని, ఇందుకోసం సీజే బెంచ్‌కు విన్నవించాలని సూచించారు. దీనికి ఘాటుగానే స్పందించిన ఆ జడ్జి, ఇందుకు నిర్దిష్ట కారణమేంటో తెలియజేయాలంటూ ఏజీని ప్రశ్నించారు.

“ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకోవాలని ఎందుకు కోరుతున్నారు? దానికి తగిన కారణమేంటి?” అని ఏజీని ప్రశ్నించారు. కానీ దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మరోమారు అదే విజ్ఞప్తి చేయడంతో, “ఇది ఒక పేలవమైన వ్యాఖ్య. ఒక ఏజీ స్థాయి అధికారి నుంచి ఇలాంటి కారణం లేని విజ్ఞప్తి వస్తుందని ఊహించలేం. ఇలాంటి రిక్వెస్టు ఒక హైకోర్టు బెంచ్‌ను అవమానించడమే. ఇటువంటి ‘బెంచ్ హంటింగ్‘ విధానం అడ్వొకేట్ జనరల్ స్థాయి నుంచి వస్తుందని ఊహించలేదు” అని జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మందలించారు.

అదనపు ఏజీపైనా ఆగ్రహం..

కృష్ణా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది వేదుల వెంకటరమణ లేవనెత్తిన వాదనకు స్పందించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, అంతర్ రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టడానికి హైకోర్టు తగిన వేదిక కాదని, ట్రిబ్యునల్ మాత్రమే తీర్పులు ఇవ్వగలుగుతుందని, గతంలో సుప్రీంకోర్టు సైతం ఇదే నొక్కిచెప్పిందని గుర్తుచేశారు. ఈ సమయంలో తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జే రాంచంద్రరావు జోక్యం చేసుకుని, ఆ తీర్పు గురించి చెప్పబోయారు. వెంటనే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జోక్యం చేసుకుని, ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున వాదనలు వినిపించడానికి ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారని, అదే కేసుకు సంబంధించి అదనపు అడ్వొకేట్ జనరల్ కూడా ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఇలా జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన అంశంపై అధ్యయనం చేయడానికి ఒక రోజు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు బెంచ్ మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed