- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటెలిజెన్స్ ఆరా.. ‘ధరణి’ఎక్కడివరకొచ్చింది..!
రాష్ట్రంలో భూ సమస్యలు పెండింగులో లేకుండా చూపించేందుకు ఉన్నతాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఏ రోజుకారోజు ఎన్ని కేసులపై రికమండేషన్లు రాసి పంపారంటూ తహసీల్దార్లపై కలెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. రిటైర్డ్ అధికారులతోనూ ఫైళ్లను అధ్యయనం చేయించి స్పెసిఫికేషన్స్ రాయిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటెలిజెన్స్ పోలీసులు ధరణి వ్యవహారాల మీద ఆరా తీస్తున్నారని తెలిసింది. తహసీల్దార్ కార్యాలయాల్లోకి వచ్చి ఈ రోజు ఎన్ని కేసులు పూర్తయ్యాయని, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఎన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు కలెక్టర్ ఆఫీసు నుంచి రోజుకు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ సమాచారాన్ని సేకరించడం, మరోవైపు ఇంటెలిజెన్స్ కూడా విచారణ చేస్తుండడంపై రెవెన్యూ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ధరణి పోర్టల్ గురించి సరైన అవగాహన లేకుండా ప్రశ్నలడుగూ, తమపై పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారని ఉద్యోగ సంఘం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోమెటిక్ మ్యూటేషన్ విషయాన్ని అర్థం చేసుకోకుండా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల లెక్కలు వేర్వేరుగా రాసుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునల్‌లో పెండింగు కేసులపై ఇంటెలిజెన్స్ విచారణ చేస్తుండడంతో సిబ్బంది, అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ లక్ష్యంతో దర్యాప్తు చేస్తున్నారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు లేకుండా, వాదనలు లేకుండా ఫైళ్లు, రెవెన్యూ రికార్డుల ఆధారంగానే కేసులను క్లోజ్ చేయాలని కలెక్టర్లు ఆదేశించిన నేపథ్యంలో తహసీల్దార్లు పనిచేస్తున్నారు. ట్రిబ్యునల్ కేసుల విచారణపై ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా ఇప్పుడు సీఎం కేసీఆర్ కు నేరుగా ఈ అంశాలను వివరించేందుకే సమాచారాన్ని సేకరిస్తున్నారన్న భయం వారిలో నెలకొంది.
కలెక్టర్లు ఓకే చెప్పినా..
మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు పెండింగులో ఉంటే ధరణి పోర్టల్ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో వేలాది మంది అప్లై చేశారు. అవి తహసీల్దార్ల ద్వారా కలెక్టర్ లాగిన్లోకి వెళ్తాయి. వాటిని పరిశీలించి ఆమోదిస్తూ కలెక్టర్లు తిరిగి తహసీల్దార్ లాగిన్లోకి పంపిస్తున్నారు. కేవలం డిజిటల్ సంతకాన్ని తహసీల్దార్ చేస్తే వారికి పట్టాదారు పాసు పుస్తకం ఇంటికే వచ్చేస్తుంది. ఇక్కడే కొందరు తహసీల్దార్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కలెక్టర్లు ఓకే చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తహసీల్దార్లు అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ఆప్షనే లేదని, అయినా, కలెక్టర్లు ఆమోదించిన ఫైళ్లకు వెంటనే డిజిటల్ సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలా పెండింగ్ పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా, మరోవైపు యుద్ధప్రాతిపదిక పెండింగు కేసులను పరిష్కరించాలని కలెక్టర్లు ఆదేశాలు ఉన్నా కొందరు తహసీల్దార్లు మాత్రం పెండింగు దారినే నడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏవి ట్రిబ్యునల్ కేసులు?
తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 2020 ప్రకారం అన్ని పెండింగు కేసులు స్పెషల్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి. తాజాగా సీసీఎల్ఏ జారీ చేసిన సర్క్యులర్ ఆర్వోఆర్2/09/2021లో అప్పీళ్లు, రివిజన్లు మాత్రమే అన్నారని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ల దగ్గర పెండింగులోని కేసులను కొందరు కలెక్టర్లు స్వీకరించడం లేదన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని, ఒకటీ రెండు సార్లు తహశీల్దార్లు వాదనలు విన్న కేసులను కూడా పెండింగ్‌గా పరిగణించాలని, కానీ వాటిని ట్రిబ్యునల్ పరిధిలో చేర్చడం లేదని ఆరోపించారు. దీంతో మండలస్థాయిలో పెండింగులో ఉన్న కేసులు సివిల్కోర్టులకే వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ట్రిబ్యునల్కేసులపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.