సుజనాకు హైకోర్టు పర్మిషన్.. అమెరికా టూర్‌కు కండిషన్స్ అప్లై..!

by Shyam |
సుజనాకు హైకోర్టు పర్మిషన్.. అమెరికా టూర్‌కు కండిషన్స్ అప్లై..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అమెరికా ప్రయాణానికి తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ల తయారీకి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై పలు కంపెనీలతో చర్చలు జరిపేందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నందున అనుమతి ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. జూలై 12న వెళ్ళి తిరిగి ఆగస్టు 11న రానున్నట్లు కోర్టుకు వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తొలుత సీబీఐ సంస్థకు పూర్తి పర్యటన వివరాలను సమర్పించాలని, తగిన సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా హైకోర్టు స్పష్టం చేసింది.

చెన్నయ్ కేంద్రంగా పనిచేస్తున్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టర్‌గా మాత్రమే కాక కీలకమైన వ్యక్తిగా ఉన్నారని, సుజనా ఇండస్ట్రీస్ కంపెనీలకు కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ బ్యాంకులకు సుమారు రూ. 6,000 కోట్ల మేర బకాయిలు ఎగవేసిన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు ఆయనపై లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో కూడా న్యూయార్క్ పర్యటన కోసం హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అప్పట్లోనే సీబీఐ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయగా దానిపై సుజనాచౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతున్నా లుక్ఔట్ నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ వాదించారు. ఆనవాయితీ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు తొలుత వారంట్ జారీ చేస్తారని, ఆ వ్యక్తి ఆచూకీ దొరకని పక్షంలో లుక్ఔట్ నోటీసులు జారీ చేస్తారని వాదించారు.

ఇప్పుడు అలాంటి వాదనలకు ఆస్కారం లేకుండా అమెరికా పర్యటనకు హైకోర్టు అనుమతి జారీ చేసింది. నెల రోజుల పాటు పర్యటించి తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకు పూర్తి వివరాలను ఇవ్వాలని సుజనా చౌదరికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story