జూలై 31దాకా విద్యా సంవత్సరం లేదు

by Anukaran |   ( Updated:2020-07-13 10:56:18.0  )
జూలై 31దాకా విద్యా సంవత్సరం లేదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త విద్యా సంవత్సరం జూలై 31 దాకా ప్రారంభమయ్యే అవకాశమే లేదని, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 31 వరకూ ఉంటున్నందున అప్పటివరకూ విద్యా సంవత్సరం ప్రారంభం కాదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వారం రోజుల్లో దానిపైన స్పష్టత వస్తుందని పేర్కొంది. ఆన్‌లైన్ తరగతులపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ పై విధంగా వాదనలు వినిపించారు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అడ్వొకేట్ జనరల్ వాదిస్తుండగా, కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిర్వహిస్తున్నాయిగదా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, కానీ సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం దాని నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయని కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని డివిజన్ బెంచ్ ప్రభుత్వ విధానాన్ని జూలై 20వ తేదీకల్లా వెల్లడించాలని సూచించి తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదావేసింది.

Advertisement

Next Story

Most Viewed