- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్‌పై ‘హెల్త్’ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నియోజకవర్గంపై వైద్యారోగ్యశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జరగబోయే ఉప ఎన్నికల కారణంగా కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వైరస్ ట్రేసింగ్‌తో పాటు వ్యాక్సినేషన్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వీటి పర్యవేక్షణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ డీఎమ్ హెచ్ఓని నోడల్ ఆధికారిగా నియమిస్తూ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నియోజకవర్గంలో కరోనాను తగ్గించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని స్పష్టం చేసింది.
ప్రతి రోజూ మండలాల వారీగా కేసులు, వ్యాప్తిని అంచనా వేస్తూ ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు ముందస్తు చర్యలను శాఖాపరంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. పక్కనే ఉన్న నియోజకవర్గాలు, జిల్లాల్లో కేసులు నమోదవుతున్న తీరును కూడా బేరీజు వేసుకుని కట్టడిపై ఫోకస్ పెట్టాలని నొక్కి చెప్పింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ప్రతీ వారం నమోదవుతున్న కేసుల తీరును పరిశీలించే బాధ్యత నోడల్ ఆఫీసర్ దేనని ప్రజారోగ్యశాఖ తేల్చిచెప్పింది. కేసులు పెరుగుతున్న చోట ప్రజలను అలెర్టు చేయాలని స్పష్టం చేసింది. కేసులు అధికంగా ఉన్న మండలాల్లోని గ్రామాల్లో కరోనా క్యాంప్‌లు నిర్వహించి వైరస్‌ను అదుపులోకి తేవాలని పేర్కొన్నది. ప్రతీ మండలానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి టెస్టులు, ట్రేసింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేయాలన్నది. ప్రతీ టీమ్‌లో మెడికల్ ఆఫీసర్, డాక్టర్, ఇద్దరు నర్సులు, ఒక టెక్నీషియన్ ను తప్పనిసరిగా ఉండాలని సూచించింది.
ఎందుకీ నిర్ణయం…?
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆ నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులూ వైరస్ బారిన పడ్డారు. సభలకు హాజరైన ప్రజలు సైతం భారీ సంఖ్యలో వైరస్‌కు గురయ్యారు. ఇద్దరు పాత్రికేయులతో పాటు చాలా మంది కరోనా కారణంగా మరణించారు. హుజూరాబాద్ లో కూడా ఎన్నికల ప్రచారానికి వేలాది మంది ప్రజలు హాజరవుతున్నందున అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతో వైద్యశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.
ఎక్కడికక్కడ టెస్టులు….
ఎన్నికల క్యాంపెయిన్‌లో తిరుగుతున్న లీడర్లకు, కార్యకర్తలకు ప్రతి పది రోజులకోసారీ వైద్యాధికారులు కరోనా టెస్టులు చేయనున్నారు. అంతేగాక సింప్టమ్స్ ఉన్న వారందరికీ టెస్టుతో సంబంధం లేకుండా ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. వీటి పంపిణీకి స్థానికంగా ఉండే ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు సహాయాన్ని కూడా తీసుకోనున్నారు. ప్రతీ గ్రామానికి వెళ్లి ర్యాండమ్‌గా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను విస్తృతంగా చేయనున్నారు. ఈ మేరకు టెస్టింగ్ కిట్లను కూడా ఆర్డర్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.
53 శాతం వ్యాక్సినేషన్ పూర్తి…
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం 53 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో టీకా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా, హూజూరాబాద్ మండలంలో 59,220 మంది టీకాకు అర్హులుండగా ఇప్పటి వరకు 29,628 మంది మొదటి, 9535 మంది రెండో డోసు తీసుకున్నారు. జమ్మికుంట మండలంలో 54,877 మంది టీకాలు తీసుకోవాల్సి ఉండగా, 30,967 మంది ఫస్ట్, 8820 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇల్లందకుంటలో ఇప్పటి వరకు 12,959 మంది ఫస్ట్, 3278 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక వీణావంకలో 19,637 మంది తొలి, 6749 మంది రెండో డోసు వేసుకున్నారు.
అన్ని రోగాలపై దృష్టి….
కరోనా వైరస్‌తో పాటు మిగతా అన్ని రోగాలపై కూడా వైద్యశాఖ దృష్టి సారించనుంది. కరోనాతో పాటు సీజనల్, పోలియో, క్యాన్సర్, కుష్ఠి, దీర్ఘకాలిక రోగాలపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక చేసిన గ్రామంలో ఎక్కడికక్కడే కరోనా టెస్టులు చేయనున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, జ్వరంతో పాటు దీర్ఘకాలిక, గర్భిణీలకు వెంటనే యంటీజెన్ టెస్టు ద్వారా కరోనా టెస్టు చేయనున్నారు. అంతేగాక ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్న చిన్నారులు, వృద్ధులు, ఇతర కేటగిరి వాళ్లకూ వెంటనే పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్ సోకిందేమోనని అనుమానం ఉన్న వాళ్లకి లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అంతేగాక కరోనాతో పాటు సీజనల్ వ్యాధులకు సైతం ఆయా క్యాంప్‌లలో మందులు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆలన మొబైల్ వాహనాల ద్వారా దీర్ఘకాలిక పేషెంట్లు మందులు, చికిత్సలు నిర్వహిస్తుండగా, స్పెషల్ టీం పర్యటనలో కరోనాతో పాటు సీజనల్ వ్యాధులకూ పరీక్షలు చేసి మందులు అందిస్తామని వైద్యశాఖ పేర్కొంటుంది.
మరోసారి విజిట్ చేస్తాం: డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు
రాష్ర్ట వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. ఇటీవల వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులంతా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించాం. స్థానికంగా ఉన్న సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చాం. ఉప ఎన్నికల నేపథ్యంలో హూజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి పర్యటించి కరోనా నియంత్రణకు సలహాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రతీ రోజూ వీడియా కాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తిగా నిర్వహిస్తుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన కరోనా మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యాక్సిన్ శైలి…
మండలం అర్హులు ఫస్ట్ డోసు రెండో డోసు
హుజురాబాద్ 59,220 29,628 9,535
జమ్మికుంట 54,877 30,967 8,820
ఇల్లందకుంట 23,879 12,959 3,278
వీణావంక 38,923 19,637 6,749