ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త జోన్ల వారీగా బదిలీల ప్రక్రియ షురూ.!

by Harish |
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త జోన్ల వారీగా బదిలీల ప్రక్రియ షురూ.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జోన్ల వారీగా ఉద్యోగుల విభజనకు అడుగు పడింది. దాదాపు మూడు నెలల నుంచి సాగుతున్న ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఉద్యోగులను జిల్లాలు, జోన్ల వారీగా విభజన కోసం ఆప్షన్ల పత్రాలను సోమవారం విడుదల చేశారు. ఈ పత్రాలను మంగళవారం లేదా బుధవారం నుంచి స్వీకరించే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్డర్​ టూ సర్వ్​ కింద కేటాయించబడిన వారందరీ నుంచి ఆప్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక జిల్లాకు చెందిన ఉద్యోగులు వేరే జిల్లాల్లో పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో జోన్లు దాటిపోయారు. కొత్త జోన్ల వారీగా ఒక జోన్​లో రిక్రూట్​ అయిన ఉద్యోగులు.. ఇతర జోన్లలో పని చేస్తున్నారు. ఇప్పుడు వారందరి స్థానికత, పాత జిల్లాల వారీగా కేడర్​ను నిర్ధారించనున్నారు. ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కొన్ని అంశాలపై కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. ఆ తర్వాత వారి స్థానికత ఆధారంగా జోన్ల వారీగా బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనిని పూర్తి చేసిన తర్వాతే కొత్త జిల్లాల వారీగా ఖాళీల వివరాలు బయటకు రానున్నాయి.

కొత్త జిల్లాల్లో.. పాత ఉద్యోగులే సర్దుబాటు

ప్రస్తుతానికి ఆర్డర్​ టూ సర్వ్​ కింద కేటాయించబడిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటుండగా.. వారి స్థానికతను తేల్చి కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్​ జారీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న వారితోనే కొత్త జిల్లాల వారీగా బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. అయితే, కొంతమంది సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నాయి. కానీ, జనాభా ప్రాతిపదికన కేడర్​ స్ట్రెంత్​ను ముందుగా తేల్చాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. పాత జిల్లాల్లో నియామకమై, కేటాయించిన ఉద్యోగులను కొత్త జిల్లాల్లో ఉన్నంత మేరకు సర్దుబాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎట్టకేలకు ఆప్షన్లు..

చాలా రోజుల నుంచి ఊరిస్తున్న ఆప్షన్ల ప్రక్రియకు అడుగు పడింది. ఈ మేరకు సోమవారం ఆప్షన్ల నమూనా పత్రాలను ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా విభజించి, ఆ పోస్టును జిల్లా, జోన్​, మల్టీజోన్​ వారీగా ఖరారు చేసి, శాఖను నిర్ధారించి ఆప్షన్​ ఇవ్వాల్సి ఉంటోంది. ఆప్షన్ల పత్రం నమూనాలో పాత జోన్​ –5లో భాగంగా ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం పరిధిలో ప్రస్తుత మల్టీజోన్​ –1లో 2018 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ నమూనా జారీ చేశారు. మల్టీజోన్​ –1లో 20 జిల్లాలను కేటాయించారు. పాత జోన్​ –5లోని ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రకారం జనగామ మల్టీజోన్​ –2కు వెళ్లింది. అదేవిధంగా పాత జోన్​వారీగా –6 జోన్​ ప్రకారం 13 జిల్లాలు ఉండగా పాత జోన్​ –6లోని నిజామాబాద్​, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి ఇప్పుడు మల్టీజోన్​కు కేటాయించారు. ఇక్కడ ఉద్యోగుల సర్దుబాటు కొంత ఇబ్బందికరంగా మారనున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. వీరి స్థానికతను ఖరారు చేసిన అనంతరం కేటాయించే ప్రక్రియలో ఉద్యోగుల ఆప్షన్లలో కొంత గందరగోళం రానున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఇక జోనల్​ కేడర్​, సెక్రెటేరియట్​, హెచ్​ఓడీ విభాగాల్లో పాత జోన్​ –5లో ఐదో జోన్​ వరకు 17 జిల్లాలు ఉండగా.. పాత జోన్​ –6లో ఆరు, ఏడు కొత్త జోన్లతో పాటుగా రెండు, మూడు, ఐదో జోన్​లోని పలు జిల్లాలు మిళితమై ఉన్నాయి. ఈ లెక్కన పాత జోన్లలో కేటాయించిన ఉద్యోగులను ఇప్పుడు కొత్త జోన్ల వారీగా సర్దుబాటు చేయడంలో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారుల అభిప్రాయం.

స్థానికత వివరాలివ్వండి..

సోమవారం ఉదయం జిల్లా, జోన్​, మల్టీజోన్ల వారీగా ఆప్షన్ల నమూనా విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం నుంచి శాఖాపరంగా మొత్తం ఉద్యోగులు, ముందుగా నియామకం అయిన జిల్లా, స్థానికత, విద్యార్హత పత్రాలన్నీ పరిశీలించి రాత్రి వరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో శాఖల వారీగా ఉన్నతాధికారులు అత్యవసర ఆదేశాలివ్వడంతో అధికారులు స్థానికతను తేల్చే పనిలో పడ్డారు. పలు శాఖలు సాయంత్రం నుంచే కార్యాలయాల్లో ఈ వివరాలను సమర్పిస్తున్నాయి. కొన్ని శాఖల అధికారులు ఉద్యోగులను అత్యవసరంగా పిలిపించుకుని స్థానికతను తేల్చే పనుల్లో పడ్డారు. స్థానికత వివరాలను తీసుకుని ఆ తర్వాత ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శాఖాపరంగా కేటాయించిన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంకా ఖాళీలు, అవసరమున్న పోస్టులపై వివరాలను తీసుకుంటున్నారు.

కొన్ని ప్రత్యేక కేసుల్లో కౌన్సెలింగ్​… ఆ తర్వాత బదిలీలు

స్థానికత, ఆప్షన్లను తేల్చిన తర్వాత కొన్ని వర్గాల ఉద్యోగులకు కౌన్సెలింగ్​ను సైతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పౌస్​ కేసు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ వంటి వర్గాల ఉద్యోగులకు సంబంధించిన ఆప్షన్లు కోరుకుంటున్న ప్రాంతాలు, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతాలపై కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నుంచి స్థానికత, ఆర్డర్​ టూ సర్వ్​ను రద్దు చేస్తూ ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

ఖాళీలు తేలేదప్పుడే..

బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత ఖాళీలపై తుది జాబితా సిద్ధం కానుంది. ఇప్పుడు శాఖల వారీగా ఎంతమంది రిక్రూట్​ అయ్యారు. ఎంతమంది పని చేస్తున్నారు. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిలో అత్యవసరం ఎన్ని అనే వివరాలన్నీ శాఖల వారీగా తీసుకుంటున్నారు. ఆప్షన్లు పూర్తి చేసి, బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మండలాల నుంచి ఖాళీల వివరాలు రానున్నాయి. ఈ ఖాళీల ప్రకారం అత్యవసరమని భావించే పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed