అక్కడ ఇంకా ‘ఈటల’నే వైద్యారోగ్య మంత్రి.. నిలిచిపోయిన ‘ఆలన’..

by Anukaran |   ( Updated:2021-06-10 09:17:36.0  )
telangana-government-ignored-the-aalana-vehicles
X

దిశ, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటి దగ్గరే ఉంటున్న పేషెంట్లకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆలన’ వాహనాలను తీసుకొచ్చింది. అయితే.. ‘ఆలన’ వాహనాల ఆలనాపాలనా ఎలా ఉన్నా వాటిపై ముద్రించిన పోస్టర్లలో మాత్రం ఈటల రాజేందరే ఇప్పటికీ వైద్యారోగ్య మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికి నెల రోజులు దాటినా ఆ శాఖలోని వివిధ విభాగాల హెడ్‌లకు మాత్రం ఆయన ఫొటోను తొలగించాలన్న స్పృహ లేకుండాపోయింది. ‘దిశ’ కథనం ప్రచురించిన తర్వాత వెబ్‌సైట్లలో ఈటల బొమ్మను తొలగించిన అధికారులు ‘ఆలన’ వాహనాలపై ఉన్న ఫొటోల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎవరో ఒకరు వేలెత్తి చూపితేనే అధికారగణం స్పందిస్తున్నారన్న భావన కలుగుతోంది.

అయితే పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘ఆలన’ వాహనాలను అధికారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నీరు గారిపోతోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆలన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో ఓ డాక్టర్, స్టాఫ్ నర్స్, డ్రైవర్ విధులు నిర్వహించాలని నిర్ధేశించింది. ఈ వాహనంలో విధులు నిర్వహించే వైద్యుడు, సిబ్బంది.. వాహనంలో రోగి ఇంటికి చేరుకొని అక్కడే వారికి కావలసిన వైద్య సేవలు అందించాల్సి ఉండగా.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రోజుల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

15 రోజులకు ఒకసారి..

అనారోగ్యంతో ఇంటి వద్ద ఉండి వైద్య చికిత్సలు తీసుకునే రోగిని ‘ఆలన’ వాహనంలో పని చేసే వైద్యుడు, నర్సు.. ప్రతీ 15 రోజులకు ఒకసారి సందర్శించి వారికి వైద్య సేవలు అందజేయాలి. కేవలం ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న రోగులకే కాకుండా.. ఇంట్లో ఇతర రోగులు ఉన్నా వారికి కూడా వైద్య సహాయం అందించాలి.

aalana Vehicle

డీఎంఈ పార్కింగ్‌లో ఆలన వాహనాలు..

పీహెచ్‌సీ పరిధిలో రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ‘ఆలన’ వాహనాలు రోజుల తరబడి కోఠిలోని డీఎం అండ్ హెచ్‌ఎస్ కార్యాలయం ఆవరణలో దర్శనమిస్తున్నాయి. ఇవి రోడ్లపై మొరాయిస్తుండటంతో చేసేదేమి లేక డ్రైవర్లు వీటిని తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నట్లు తెలిసింది. వీటి నిర్వహణ.. భారం అవుతుండగా ఉన్నతాధికారులు పట్టించుకోని కారణంగా.. వీటిని డీఎంఈ కార్యాలయం ఆవరణలో వదిలి వేసి వెళ్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed