తెలంగాణ ఇంజినీర్లు దేశానికి మార్గదర్శకులు

by Shyam |
Vinod Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో ఇంజనీర్ల పాత్ర అమోఘమని, రాష్ట్ర ఇంజనీర్లు దేశానికి మార్గదర్శకులని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జలసౌదలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 144 వ జయంతిని పురస్కరించుకొని 8వ తెలంగాణ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఇంజనీర్లు నవాబ్ అలీనవాజ్ జంగ్ బహదూర్ తో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్. విద్యాసాగర్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీర్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర పునర్ నిర్మాణంలో చురుగ్గా పని చేస్తున్నారని కొనియాడారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి ఇరిగేషన్, విద్యుత్ రంగంలో పని చేస్తున్న ఇంజనీర్లే కారణమన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందజేసిన మిషన్ భగీరథ పథకం పూర్తైందంటే మన ఇంజనీర్ల కృషియే అన్నారు. రోడ్లు భవనాలు, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న ఇంజనీర్ల కృషితోనే తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నదని కొనియాడారు.

హైదరాబాద్ రాజ్యంలో గొప్ప సేవలు అందించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బాహదూర్ వారసత్వాన్ని రాష్ట్రంలో మన ఇంజనీర్లు సమున్నతంగా కొనసాగించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అలీ నవాజ్ జంగ్ చరిత్ర కనుమరుగు అయ్యిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన జయంతిని తెలంగాణ ఇంజనీర్స్ డేగా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారని పేర్కొన్నారు. అవార్డులు యువ ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇస్తాయన్నారు.

Engineers Day

హైదరాబాద్ రాజ్యంలో అలీ నవాజ్ జంగ్ నిజాంసాగర్, పోచారం, పాలేరు, వైరా, తదితర భారీ మద్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్ నగరంలో అనేక చారిత్రిక భవనాలు నిర్మించారన్నారు. హైదరాబాద్ రాజ్య ఆర్థిక పురోగతికి దోహదం చేసిన మహా మనిషి నవాజ్ జంగ్ అని కొనియాడారు. ఆయన వారసత్వం కొనసాగాలని ఆకాంక్షించారు.

అనంతరం వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో విశేష సేవలు అందించిన ఇంజనీర్లకు అలీ నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాల్లో భాగంగా 2021 సంవత్సరానికిగాను ఇరిగేషన్ రంగంలో విశేష సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే సానా మారుతి, తెలంగాణ ట్రాన్స్కో డైరెక్టర్ (లిఫ్ట్స్) సూర్యప్రకాష్ , సింగరేణి సంస్థ విశ్రాంత డైరెక్టర్ వాసుదేవరావుకు పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, విశ్రాంత ఇంజనీర్ల సంఘం సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి, సత్తి రెడ్డి, దామోదర్ రెడ్డి, రాంరెడ్డి, ఇన్ స్టిట్యూషన్ ఆప్ ఇంజనీర్స్ అంజయ్య, రమణా నాయక్, రామేశ్వర రావు, శంకర్ ప్రసాద్, జనార్దన్, వీరయ్య, వాటర్ రిసోర్సెస్ సంస్థ చైర్మన్ వి. ప్రకాష్, తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నాయకుడు వెంకటేశం, విద్యుత్ ఇంజనీర్ల సంఘం తరపున శివాజీ, తెలంగాణ ఏఈఈల సంఘం సభ్యురాలు రమ, 300 మంది పాల్గొన్నారు.

Advertisement

Next Story