కేసీఆర్.. తెలంగాణ అంటే హుజూరాబాదే కాదు : విజయశాంతి

by Shyam |
Vijayashanti Facebook
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అంటే హుజూరాబాద్ మాత్రమే అన్నట్టుగా సర్కారు వ్యవహరిస్తోందని, కేసీఆర్‌కు ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ దళిత బంధు పథకం’ ప్రకటించి, దీని అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. ఈ పథకం అమలులో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక కూడా చేశారని, ఈ నిర్ణయం వెనుక లోగుట్టు ఏమిటో ప్రజలకు తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటుండదన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని 20 వేల పైచిలుకు కుటుంబాల కోసం రూ.2 వేల కోట్ల మేర ఖర్చుచేస్తామని ప్రకటించారన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్‌ను ఎంచుకోవడమంటే… ఆ పథకాన్ని ముందుగా ఇక్కడ అమలు చేసి, ఫలితాలను బట్టి లోటుపాట్లు సరిచేసి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ ప్రకటించారని, ఇక తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా?…అని ప్రశ్నించారు.

సీఎం లెక్క ప్రకారం కార్యరూపం దాల్చడానికి 165 ఏళ్లు పడుతుందని, ఇది చూస్తుంటే దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… అంటూ కేసీఆర్ మరచిన వాగ్దానాలు… దళిత ఉపముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద లాగే ఈ దళిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యేలా అనిపిస్తోందని విమర్శించారు. ఉపఎన్నికల నేపథ్యంలో విపక్షాలు కోర్టుకెక్కి ఆపితే… దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలపై నింద మోపి, దీనిని ప్రచారాస్త్రం చేసుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు.

హుజూరాబాద్‌పై సీఎం అంతులేని ప్రేమకు బీజాలు ఎప్పుడో పడ్డాయని, ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ నియోజకవర్గంలోనే దర్శనమిస్తూ రోడ్లు, ఫంక్షన్, కమ్యూనిటీ హాళ్లు అంటూ జనంపై వరాల జల్లు కురిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సహా హుజూరాబాద్ పట్టణం… ఇంకా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి అంటూ వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో మరిన్ని పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఇది ఎన్నికల స్టంటే అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసే వాగ్ధానాల అమలు గురించి హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ప్రజల్ని అడిగితే బాగా చెబుతారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed