- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ సెషన్‌కు కరోనా ఎఫెక్ట్
దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై ‘కరోనా’ ఎఫెక్ట్ పడింది. ఈ నెల 20వ తేదీ వరకు జరపాలని అనుకున్న సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగిశాయి. పన్నెండు పనిదినాలపాటు నిర్వహించాలని బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) నిర్ణయం తీసుకున్నా అది తొమ్మిది రోజులకే కుదించబడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. వివిధ శాఖలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన డిమాండ్లు, గ్రాంట్లపై కూడా చర్చించే సమయం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లే అసెంబ్లీ సమావేశాలను కూడా హడావిడిగా ముగించాల్సి వచ్చింది. జనసమ్మర్ధం ఉంటుందన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల ముందే ముగించింది.
తొమ్మిది రోజులపాటు జరిగిన సమావేశాల్లో మొత్తం 48.41 గంటలు చర్చ జరిగినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు బిల్లులకు ఉభయసభల ఆమోదం లభించింది. రెండు తీర్మానాలు(ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పదేళ్ళపాటు పొడిగించడంపైన, సీఏఏ పైన) సైతం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. రెండు స్వల్పకాలిక చర్చలు(కరోనా, పల్లెప్రగతి) కూడా జరిగాయి. తొలుత బీఏసీ సమావేశంలో తీసుకున్ననిర్ణయం ప్రకారం ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు (మార్చి 9, 10, 15 తేదీలు సెలవు రోజులు) సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా నాలుగు రోజుల ముందే సమావేశాలు ముగిశాయి. పన్నెండు పనిదినాలకు బదులుగా తొమ్మిది రోజులే సమావేశాలు జరిగాయి.
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అనేక శాఖల అంశాలను చర్చించడానికి పన్నెండు రోజుల సమయం సరిపోదంటూ కాంగ్రెస్ సభ్యులు తొలుత బీఏసీ సమావేశంలో ప్రస్తవించినప్పుడు అవసరాన్ని బట్టి పొడిగించుకోవచ్చంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పన్నెండు రోజులు సమయమే సరిపోదన్న అభిప్రాయం వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు అది తొమ్మిది రోజులకే తగ్గిపోవడం గమనార్హం. చర్చల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులకు పదేపదే అధికార పార్టీ సభ్యులు అడ్డుపడడం, సమయం వృథా కావడం, చివరకు స్పీకర్ తమకు తగిన సమయాన్ని కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అసంతృప్తి ఇలా ఉండగానే కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది రోజులకే నిరవధికంగా వాయిదా పడడం గమనార్హం.
మరోవైపు పార్లమెంటు సమావేశాలపై కూడా ఈ తరహా ప్రభావం పడే అవకాశం ఉంది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 3వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఈ నెల 20వ తేదీతో ముగించాలన్న చర్చలు జరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే కోర్టు పనిదినాలు కూడా తగ్గిపోయాయి. చివరకు అది చట్టసభలపై కూడా ప్రభావం పడక తప్పలేదు.
Tags : Telangana, Assembly, Adjourned, Working days, Speaker, Budget Session