పాలమూరు-రంగారెడ్డి వెరీ స్లో… వివక్షే కారణమా?

by Shyam |   ( Updated:2020-11-26 03:34:08.0  )
పాలమూరు-రంగారెడ్డి వెరీ స్లో… వివక్షే కారణమా?
X

దిశ, మహబూబ్ నగర్:
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేండ్లలో పూర్తి చేస్తామని 2015లో శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతానికి 5 ఏండ్లు పూర్తి కావస్తున్నా 30% పనులు కూడా జరగలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు పూర్తి స్థాయిలో సాగునీరు, నల్లగొండ జిల్లాకు పాక్షికంగా, హైదరాబాద్​కు తాగునీరు అందనుంది. అయితే నిధుల కేటాయింపులు లేక ఆశించిన స్థాయిలో పనులు సాగడం లేదు. మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం పాలమూరుపై సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది. ప్రాజెక్ట్ లక్ష్యం 12.30 లక్షల ఎకరాలకు నీరు అందించడం కానీ, సీఎం మాత్రం దాదాపు 20 లక్షల ఎకరాలకు అందుతాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదు కాబట్టే సోమవారం జరిగిన సమావేశంలో 2 టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నాడు సమైక్య పాలకుల నిర్లక్ష్యం.. మరి నేడు?

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 240 కిలోమీటర్ల మేర కృష్ణా నది పారుతోంది. అయినా ఆశించిన స్థాయిలో నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. ఆనాడు సమైక్య పాలకులు కృష్ణా నీటిని తరలించుకు పోయారు. నేడు స్వరాష్ట్రంలో పనులు జరగడం లేదు. ఆలస్యంగా పురుడు పోసుకున్న కాళేశ్వరం మాత్రం దాదాపుగా పూర్తయ్యిందని ప్రభుత్వమే ప్రకటించింది. కొందరు కోర్టులో కేసులు వేయడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొచ్చినా.. ఉత్తర, దక్షిణ తెలంగాణల వివక్ష కారణమేమోననే చర్చ కూడా జరుగుతోంది.

ప్రాజెక్ట్ రీడిజైన్

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ₹7 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు ఈ ప్రాజెక్టుకు రీడిజైన్ చేశారు. మొదట మహబూబ్​నగర్ జిల్లా సమీపంలోని కోయిలకొండ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మించాలని భావించారు. తర్వాత భూత్పూరులోని కరివెన ప్రాంతానికి మార్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 4.13 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.00 లక్ష, రంగారెడ్డిలో 3.63 లక్షలు, వికారాబాద్‌లో 3.22 లక్షలు, నల్లగొండలో 30 వేల ఎకరాల చొప్పున మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా డిజైన్ మారింది. ఇందుకోసం భూ సేకరణ ప్రణాళిక కూడా తయారైంది. ఇప్పటికీ వనపర్తి జిల్లాలో 227 ఎకరాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 3312 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 3084 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు వనపర్తి జిల్లాలో 3974 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 8579 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 7673 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు తెలిపారు.

నిధులు రిలీజ్ కావట్లే..

కృష్ణానదికి వరద వచ్చే 60 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున మొత్తం 120 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. మొదట ₹35,200 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమైనా తరువాత దాని రీడిజైన్ పేరుతో 49,595 కోట్లకు పెరిగింది. కానీ గడచిన ఆరున్నరేళ్లలో ఈ ప్రాజెక్టుకు చేసిన ఖర్చు ₹7,241.81 కోట్లు మాత్రమే. శ్రీశైలం రిజర్వాయర్‌‌కు దగ్గరలోని ఎల్లూర్‌‌ పంపుహౌస్‌‌ అప్రోచ్‌‌ చానెల్‌‌ నుంచి ప్రాజెక్టు మొదటి ప్యాకేజీ ప్రారంభించి ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌కు తరలించాల్సి ఉంది. అలాగే మొదటి దశలో ఉదండాపూర్‌‌ వరకు 18 ప్యాకేజీల్లోని పనులకు సాంకేతిక అనుమతులు కూడా లభించాయి. పనుల వేగంపై స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించలేదు. పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందినవారే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹10 వేల కోట్ల రుణం తీసుకుంది.

నీటి తరలింపు కుదింపు

మొదటగా రెండు టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారు. తాజాగా ఒక టీఎంసీ నీటినే ఎత్తిపోసేలా ఎస్టిమేట్ లను తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఒక్క టీఎంసీ నీటిని మాత్రమే తరలిస్తే ప్రాజెక్టు లక్ష్యం నీరుగారుతుందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఏపీ సర్కారు శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నీటి తరలింపుపై కోతలు పెట్టడమేంటని రిటైర్డ్‌ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రెండు టీఎంసీలతో ప్రాజెక్టును చేపట్టకుంటే ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్ లో చిన్న చూపు..!

సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు మాత్రం అన్యాయమే చేస్తోంది. బడ్జెట్ లో నామమాత్రంగానే నిధులు కేటాయిస్తున్నా.. అవి కూడా రిలీజ్ కావడం లేదు. ఇప్పుడు జరుగుతున్న కేటాయింపుల నిష్పత్తిని చూస్తే మరో దశాబ్దం గడిచినా పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం ₹500 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం దాన్ని కుదించి ₹368.58 కోట్లకు పరిమితం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం ₹49,595 కోట్లు అవుతుందని అంచనాలు ఉండగా ఇప్పటి వరకు కేవలం ₹7241.81 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఓ వైపు పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీళ్ల దోపిడీపై ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుపైనా పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌ స్కీమ్‌‌ను కుదించాలని నిర్ణయించడం సరికాదంటున్నారు.

పాలమూరు – రంగారెడ్డి కేటాయింపులు, ఖర్చుల వివరాలు

బడ్జెట్ సంవత్సరం కేటాయింపులు (కోట్లలో) చేసిన ఖర్చు (కోట్లలో)
2014–15 05 4.56
2015–16 100 380.26
2016-17 7,861 680.26
2017-18 4,029 1,948.40
2018-19 3,065 2,587.65
2019-20 1,867.14 1,640.68
2020 -21 368.58 ——–

ప్రాజెక్టుపై కరోనా ఎఫెక్ట్?

ప్రస్తుతం కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయానికి భారీ స్థాయిలోనే గండిపడింది. ఈ నేపథ్యంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపులు ప్రభుత్వం అనుకున్నట్లుగా చేయగలుగుతుందా అనే అనుమానాలు ఇప్పుడు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అయిన ₹7,241 కోట్ల పనులకు సంబంధించి సుమారు ₹1,665 కోట్లు ఇంకా రిలీజ్ కాలేదు. మొత్తం 18 ప్యాకేజీల పనులను నవయుగ, రాఘవ, మెఘా, ఎస్ఈడబ్ల్యూ లాంటి కంపెనీలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం కేటాయించిన నిధులు ఏ మేరకు విడుదలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఇంకా ₹40 వేల కోట్లకంటే ఎక్కువే సమకూర్చాల్సి ఉంటుంది. ఇప్పటి ఆర్థిక సంక్షోభం ఇంకా ఏడాది, రెండేళ్లు వెంటాడుతుందనే ఆర్థికవేత్తల అంచనాలతో పాలమూరు ప్రాజెక్టుకు ప్రభుత్వం అంత ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేయగలుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పూర్తికాని భూసేకరణ..

నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టుల కింద భూసేకరణ లక్ష్యం పూర్తికాలేదు. ఉద్దండాపూర్, వల్లూరు, శంకరాయపల్లి తదితర గ్రామాల ప్రజలు ప్రభుత్వం నుంచి అందుతున్న పరిహారంలో వ్యత్యాసంపై ఆందోళన బాట పట్టారు. ఈ కారణంగా ఉద్దండాపూర్ జలాశయం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అంజనగిరి, వట్టెం, కరివెన జలాశయాల పరిధిలో సొరంగం, కాలువలు, పంపుహౌస్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద పనిచేస్తున్న చాలా మంది గుత్తేదారులు పెండింగ్ బిల్లులపై అసంతృప్తితో ఉన్నారు. వర్షానికి పలు చోట్ల కాలువలు, రిజర్వాయర్ కట్టలు తెగిపోతున్నాయి. వీటిన పరిశీలించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తొమ్మిది ప్రాజెక్టులకూ నిధులు అంతంతే..

ఉమ్మడి జిల్లాలో పాలమూరు – రంగారెడ్డితో పాటు మరో తొమ్మిది సాగునీటి పథకాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు ప్రభుత్వం కేవలం ₹81.62 కోట్లను మాత్రమే కేటాయించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం గతేడాది ₹4 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ₹2.55 కోట్లు కేటాయించింది. నెట్టెంపాడుకు గతేడాది ₹25 కోట్లు కేటాయిస్తే ఈ సారి ₹17.37 కోట్లు, భీమాకు ₹170 కోట్ల స్థానంలో ఈసారి ₹18.99 కోట్లు, కోయిల్‌సాగర్‌కు గతంలో ₹25 కోట్లు ఈసారి ₹17.65 కోట్లు, ఆర్డీఎస్‌కు ₹27.50 కోట్లు ఈసారి ₹6.32 కోట్లు, జూరాలకు గతంలో ₹5 కోట్లు ఈసారి ₹25 కోట్ల చొప్పున కేటాయించింది. అయితే ఈ బడ్జెట్లో కొత్తగా సంగంబండకు ₹18.07 కోట్లు, కోటిపల్లి రిజర్వాయర్ కు ₹17లక్షలు, జూరాల పాకాలకు ₹25 లక్షలను కేటాయించింది. అయితే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో సంబంధం లేకుండా మిగతా ప్రాజెక్టుల పనులకు ₹2300 కోట్లమేరకు నిధులు అవసరం. కానీ ప్రభుత్వం నుండి కేవలం ₹81.62 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల ముందు అర్భాటంగా శంకుస్థాపన చేసిన గట్టు ఎత్తిపోతల పథకం గురించి ఈసారి బడ్జెట్లో కనీసం ప్రస్తావనే లేదు.

Advertisement

Next Story

Most Viewed