అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.. తహసిల్దార్ హెచ్చరిక

by Sridhar Babu |
illegal construction
X

దిశ, శంషాబాద్ : ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని రాజేంద్రనగర్ తహసిల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. మూసీ కాలువకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో రాజేంద్రనగర్ ఆర్డిఓ చంద్రకళ స్పందించారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145లో మూసీ కాలువను అనుకుని ఉన్న ఆరు భవనాలతో పాటు మరో మూడు భారీ షెడ్లను పోలీసు బందోబస్తు ఆధ్వర్యంలో జేసీబీలతో రాజేంద్రనగర్ తాసిల్దార్ చంద్రశేఖర్ గౌడ్ గురువారం కూల్చివేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని, ఆ భవనాలను కూల్చివేయడం తథ్యం అని తెలిపారు. అంతేకాకుండా కూల్చివేసిన ప్రాంతాల్లో మరోసారి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే నేరుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed