పిల్లలకు సుస్థిరాభివృద్ధి పాఠాలు చెప్పండిలా..

by  |
పిల్లలకు సుస్థిరాభివృద్ధి పాఠాలు చెప్పండిలా..
X

పర్యావరణం పరిస్థితి గురించి వార్తల్లో, చర్చల్లో మాట్లాడుకోవడమే తప్ప, ప్రాక్టికల్‌గా దాన్ని రక్షించే ప్రయత్నం చేద్దామని మాత్రం చాలా తక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. సుస్థిరాభివృద్ధి గురించి ఎక్కువగా తెలిసిన వాళ్లేమో వేదికలు ఎక్కి పాఠాలు చెబుతున్నారు, ఏ మాత్రం తెలియని వాళ్లేమో మనకెందుకులే అని వదిలేస్తున్నారు. ఇక తెలిసీతెలియని వాళ్లేమో పైకి మాత్రం పాఠాలు చెబుతూ లోపల మాత్రం పర్యావరణ హానికర పనులు చేస్తూనే ఉన్నారు. దీని వల్ల ప్రస్తుత తర అవసరాలు తీరుతాయి కానీ, రాబోయే తరాలకు చెప్పుకోలేని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ప్రపంచంలో జీవించబోయేది రాబోయే తరాలు. కాబట్టి వారి వనరులను వారే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ముందు వారికి సుస్థిరాభివృద్ధి గురించి తెలియాలి. కాబట్టి ఇప్పుడు వాళ్లు ఎలాగూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన జ్ఞానాన్ని వారికి పంచి, పాటించేలా స్ఫూర్తి నింపితే పర్యావరణానికి మనవంతు సాయం చేసినట్లవుతుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలకు వివిధ కార్యక్రమాలు, అవగాహనా సదస్సుల ఏర్పాటు చేయడంతో పర్యావరణం, సుస్థిరాభివృద్ధి గురించి కొద్దోగొప్పో తెలిసింది. అయితే దానిని వారి మనసుల్లో పాతుకుపోయేలా చేయడానికి కొన్నిదారులు ఉన్నాయి. అవేమీటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అన్వేషించడం నేర్పండి..

పిల్లల్లో ఒక అంశం గురించి కుతూహలాన్ని సృష్టించి, వారిలో అన్వేషణ ఆసక్తిని పెంపొందించాలి. సుస్థిరాభివృద్ధి అనేది సహజంగా సంక్లిష్టమైన అంశం కాబట్టి ముందుగా వారిలో ఆసక్తిని కలిగిస్తే దాని గురించి అన్వేషించాలనే ఆసక్తి కలుగుతుంది. రోజూ ఉపయోగించే తాగు నీళ్లు, కఠినంగా ఉండే నీళ్లకు మధ్య తేడా గురించి, సాధారణ నీళ్లను కాకుండా మినరల్ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వారికి వివరించగలిగితే తొలిమెట్టు పడినట్లే. అలాగే జీవావరణాలు, ప్రకృతిలో జీవులు, మనుషులు, చెట్లు, ఆకులు, పువ్వులు ఇలా ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని సమిష్టిగా ఎలా బతుకుతాయో, పర్యావరణం క్షీణించడం కారణంగా వాటికి కలుగుతున్న నష్టం ఏంటో తెలియజేయాలి. ముందుగా ఇంట్లో రోజూ కనిపించే సహజ వస్తువుల గురించి ప్రశ్నలు వేసే స్వభావాన్ని వారిలో సృష్టించాలి.

మీరే ప్రశ్నించండి..

పిల్లల్ని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లినపుడు వారు ఏమేం గమనించారో చెప్పమని అడగండి. ప్రకృతితో వారిని మమేకం చేసి, వారిలో ప్రశ్నలు కలిగే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వారు ప్రశ్నలు అడగకపోతే మీరే చొరవ తీసుకుని, సహజవనరుల గురించి ప్రశ్నలు అడగాలి. వాటికి పిల్లలు సమాధానాలు తప్పుగా చెప్పినా సరే, తప్పు అనకుండా వారి చెప్పిన సమాధానంతోనే ముడిపెడుతూ అసలైన జవాబు చెప్పాలి.

గ్రామం నుంచి ప్రపంచం వరకు..

సుస్థిరాభివృద్ధి పేరుతో ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, అర్కిటిక్‌లో మంచు కరగడాలు వంటివి చెప్పకూడదు. ముందుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఒకప్పుడు ఇప్పుడు ప్రాకృతికపరంగా వచ్చిన మార్పుల గురించి చర్చించండి. వీలైతే ఫొటోలు, వీడియోలు చూపించండి. పర్యావరణాన్ని సరిగా సంరక్షిస్తే అవి ఎలా ఉండేవో తెలియజేయండి. మీ ఇల్లు, మీ గ్రామం, మీ జిల్లా, మీ రాష్ట్రం, తర్వాత దేశం, ప్రపంచం గురించి వివరించాలి. అప్పుడు దశల వారీగా విజ్ఞానం పిల్లల్లో ఏర్పడుతుంది.

ప్రవర్తన అలవరుచుకునేలా చేయండి..

తినగానే చెత్తను డస్ట్‌బిన్‌లో పడేయడం, వీలైనంత మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఒక వస్తువు పాడైతే వెంటనే కొత్తది కొనే అలవాటు చేయకుండా పాతదాన్నే రిపేరు చేయించుకునేలా స్ఫూర్తినింపడం..వంటి అలవాట్లను వారి రోజువారీ జీవితంలో భాగం చేయాలి. సుస్థిరాభివృద్ధి అనేది పాఠాల ద్వారా రాదు. పాటించినపుడే దొరుకుతుందని వారికి రుజువు చేయాలి. చెప్పిన పాఠాలు అన్నింటినీ వారు ప్రాక్టికల్‌గా అమలు చేయగలిగే అవకాశాన్ని కల్పించాలి.

దబాయించొద్దు..

ఏదో స్కూళ్లో హోం వర్క్ చేయకపోతే దబాయించి చేయించినట్లుగా ఈ పాఠాలు నేర్పించకండి. సుస్థిరాభివృద్ధి పాఠాలు ఒక సిలబస్ పెట్టుకుని, కఠినంగా నేర్పించేవి కావు. అవకాశాన్ని వినియోగించుకుని అప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా నేర్పించేవి. కాబట్టి పిల్లలు మీరు చెప్పిన అంశాన్ని మర్చిపోయినా, చెప్పినట్లు వినకపోయినా కోప్పడకండి. అలా చేస్తే వారికి ఈ అంశం అంటేనే భయం ఏర్పడే అవకాశం ఉంటుంది.

మీకు అన్ని తెలియవు..

కొంతమంది పెద్దవాళ్లకు కూడా సుస్థిరాభివృద్ధి గురించి విశాలదృష్టిలో జ్ఞానం ఉండకపోవచ్చు. అయితే ఈరోజుల్లో ఇంటర్నెట్‌లో దొరకని విషయం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పిల్లలు ఉండరు. కాబట్టి వారికి ప్రాథమిక అంశాలను మాత్రం ప్రాక్టికల్‌గా బోధించి మిగిలిన లోతైన విషయాల కోసం ఇంటర్నెట్‌లో వెతకాలని సలహ ఇవ్వండి. అందుకు సంబంధించి వెబ్‌సైట్లు, కార్యక్రమాలు, మూవీల గురించి మీరు కూడా ఒకసారి వెతికి జాబితా రాసుకుని, పిల్లలతో కలిసి చూడండి.


Next Story

Most Viewed