వైసీపీ అల్లరి మూకలు పెట్రేగిపోతున్నాయి.. డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

by Web Desk |   ( Updated:2022-02-22 13:15:43.0  )
వైసీపీ అల్లరి మూకలు పెట్రేగిపోతున్నాయి.. డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య పై డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. 'రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయి. రాష్ట్రంలో సామాన్యుల ధన, మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలతో వైసీపీ అల్లరిమూకలు పేట్రేగిపోతున్నాయి.

మీరు బాధ్యతలు స్వీకరించిన రోజునే విశాఖలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరు చూశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం ప్రాథమిక సహకార సంఘం విశ్రాంత ఉద్యోగి రాయపురెడ్డి కృష్ణమూర్తి.. వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడంలో సహకార సంఘం అధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే జాప్యం చేస్తున్నారని, ఆ జాప్యం వెనుక స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందని చెబుతూ వాంగ్మూలం కూడా ఇచ్చారు.

ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ కారకులైన వైసీపీ నేతలపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. తక్షణమే మీరు స్పందించి ఒక వ్యక్తి మరణానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలి. ఈ విషయంలో నిందితులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మీరైనా చిత్తశుద్ధితో వ్యవహరించి శాంతి భద్రతలు పరిష్కరించి అరాచక శక్తుల పట్ల చర్యలు తీసుకుంటారనే నమ్మకంతో ఈ లేఖ రాస్తున్నాను' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed