బాబు యాత్ర టీడీపీకి కలిసొస్తుందా?

by srinivas |
బాబు యాత్ర టీడీపీకి కలిసొస్తుందా?
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేటి నుంచి ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొప్పూడి గ్రామం నుంచి ఈ యాత్ర ఆరంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోని టీడీపీ ఈ యాత్రను చేపట్టనుంది. ఈ యాత్ర ద్వారా వైఎస్సార్సీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. అయితే బాబు యాత్ర కలిసొస్తుందా? అన్నదే ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్సుకత రేపుతున్న ప్రశ్న.

టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుమారు 45 రోజుల పాటు జరుగుతుంది. అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రావాలన్న ఆలోచనతో బాబు ప్రణాళికను సిద్ధం చేశారు. తొమ్మిది నెలల కాలంలో వైఎస్సార్సీపీ నవమోసాలు చేసిందంటూ ప్రజలకు వివరించనున్నారు. వైఎస్సార్సీపీ అమలులోకి తెస్తామన్న నవరత్నాలు.. రత్నాలు కాదు నవభారాలు అంటూ టీడీపీ విమర్శిస్తోంది. ఈ మేరకు కరపత్రాలు, స్టిక్కర్లను కూడా తయారు చేసి ప్రదర్శించింది. వీటిని బాబు పర్యటన సమయంలో ఆయా మార్గాల గుండా ప్రదర్శించనున్నారు.

ఈ 45 రోజుల చైతన్య యాత్రలో.. ఫించను అందక గుండెఆగిన కుటుంబాలను పరామర్శించాలి, ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించి, మేమున్నామనే భరోసా కల్పించాలి. కార్యకర్తల వేధింపులను నిరసించాలి అంటూ పార్టీ కేడర్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ నిర్ణయాలతో 290 మంది రైతులు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు, 45 మంది అమరావతి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీడీపీ చెబుతోంది. రాజధాని అమరావతిలో ఉంటుందని జగన్ ప్రకటించేవరకు పోరాటం ఆగదని బాబు ప్రతిజ్ఞ చేశారు.

బాబు పోరాట యాత్ర వైఎస్సార్సీపీ వైఫల్యాల పట్ల ప్రజలను చైతన్య పరిచేందుకా? లేక అమరావతికి మద్దతుగానా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలన్న బాబు పట్టుదల ఎందుకు? అన్నది రాష్ట్ర ప్రజానీకానికి అర్ధం కావడం లేదు. అమరావతిలో తప్పించి ఇంకెక్కడైనా రాజధాని అయితే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమిటి? అన్న ప్రశ్నకు టీడీపీ నేతల నుంచి సమాధానం కరవవుతోంది. అమరావతిలో ఏముందని రాజధాని అన్నారని నిలదీస్తే సమాధానం చెప్పడం లేదని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. కేవలం తమ సామాజికవర్గానికి లబ్ది చేకూర్చుకునేందుకే బాబు రాజధాని డ్రామాలంటూ అధికారపార్టీ ఆరోపిస్తోంది.

వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి 9 నెలలు మాత్రమే అయింది. ఈ 9 నెలల్లో ఏ అద్భుతాలు జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారో అర్ధం కావడం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఏడాది పరిపాలన కాలం చూడకుండా రాజకీయ విమర్శలు చేయడం తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి వాసులు తప్ప ఇతర ప్రాంత వాసులెవరూ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించలేదు. హైదరాబాదులో జరిగిన అభివృద్ధి నేపథ్యంలో రాజధాని తమ ప్రాంతంలో ఉంటే బాగుంటుందని మూడు ప్రాంతాల వాసులూ కోరుకున్నారు. దీంతో రాజధాని పోరాటంలో ఆ రెండు జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల నుంచి టీడీపీకి మద్దతు కరవైంది.

ఈ పరిస్థితుల్లో టీడీపీ చేపట్టిన యాత్ర ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చనుందంటే స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. అయితే టీడీపీ కేడర్‌లో నిరుత్సాహం చేరకుండా ఉంటుంది. పార్టీ నాయకత్వం క్రియాశీలకంగా ఉండడం వల్ల మనకొచ్చిన నష్టమేదీ లేదని కిందిస్ధాయి కార్యకర్తలు ధైర్యంగా ఉండగలరని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు త్వరలో జరుగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని టీడీపీ భావిస్తోంది. మరింతకీ టీడీపీ ప్లాన్ వర్కవుటవుతుందా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.

Advertisement

Next Story