అంచనాలను అందుకోని టీసీఎస్ ఆర్థిక ఫలితాలు

by Harish |
అంచనాలను అందుకోని టీసీఎస్ ఆర్థిక ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక ఫలితాలను ప్రారంభించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 28.5 శాతం పెరిగి రూ. 9,008 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.7,008 కోట్ల లాభాలను నమోదు చేసింది. కరోనా ప్రతికూల సమయంలో డిజిటల్ సేవలకు గణనీయమైన డిమాండ్ కారణంగానే మెరుగైన లాభాలను సాధించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రధాన కన్సల్టెన్సీ సంస్థలన్నీ టీసీఎస్ 30 శాతానికి పైగా లాభాలను ఆర్జించగలదని అంచనా వేశాయి. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో టీసీఎస్ కార్యకలాపాలా ఆదాయం 18.5 శాతం పెరిగి రూ. 45,411 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 7 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ‘ జూన్‌తో ముగిసిన త్రైమాసికం అందిరికీ సవాళ్లతో కూడుకున్నది. తమ సంస్థలోని ఉద్యోగులు అన్ని విధాలుగా సవాళ్లను అధిగమించడం, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతో కీలక పాత్రను పోషించారని’ టీసీఎస్ సీఈఓ, ఏండీ రాజేష్ గోపీనాథన్ అన్నారు. కాగా, గురువారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేర ధర 0.56 శాతం క్షీణించి రూ. 3,257 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story