వాహనాల ఫ్రీ సర్వీస్ గడువు పొడిగించిన టాటా మోటార్స్!

by Harish |   ( Updated:2021-05-11 06:35:51.0  )
వాహనాల ఫ్రీ సర్వీస్ గడువు పొడిగించిన టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఈ నెల 31వరకు ఉన్న వాహనాల ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్యాసింజర్ వాహన వినియోగదారులకు వారెంటీ, ఉచిత సర్వీస్ గడువును జూన్ చివరి వరకు వెసులుబాటు ఇస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షల వల్ల తమ కస్టమర్లు వాహనాల సర్వీసులను సమయానికి తీసుకుని రాలేకపోతున్నారని, వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని కిలోమీటర్లను మినహాయించి వారెంటీ, ఉచిత సర్వీస్ గడువును పొడిగిస్తున్నామని కంపెనీ వివరించింది.

‘కరోనా మహమ్మారి వేగంగా పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమ వినియోగదారులు సమయానికి వాహనాలను సర్వీసింగ్ కోసం తీసుకురాలేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ డింపుల్ మెహతా చెప్పారు. కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మెరుగైన సేవలను అందించేందుకు ‘బిజినెస్ ఎజిలిటీ ప్లాన్’ను రూపిందిస్తున్నామని కంపెనీ తెలిపింది. కాగా, టాటా మోటార్స్‌కు దేశవ్యాప్తంగా 400కి పైగా ప్రాంతాల్లో 608కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed